మోడీ మాట కోసం ఏపీతో పాటు తెలంగాణ ఎదురు చూపు, లెక్కలేస్తున్నారు!
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ రాష్ట్రానికి భారీ ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో ఏపీ కూడా భారీగానే ఆశలు పెట్టుకుంది. ఏపీతో పాటు తెలంగాణ కూడా ప్యాకేజీ పైన ఆశలు పెట్టుకుందని చెప్పవచ్చు. బీహార్‌కు రెండు రోజుల క్రితం రూ.1.65 లక్షల భారీ ప్యాకేజీని ప్రధాని మోడీ ప్రకటించారు.
దీంతో, ఏపీతో పాటు తెలంగాణ ప్రభుత్వంలోను సరికొత్త ఆశలు పుట్టుకు వచ్చాయని చెబుతున్నారు. విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ప్యాకేజీ ఇవ్వాలని తెలంగాణ నేతలు చెబుతున్నారు.
ఏపీతో పాటు తమకూ ప్రత్యేక ప్యాకేజీ, రాయితీలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం చాలా రోజులుగా కోరుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలను ఆదుకుంటామని కేంద్రమంత్రులు సైతం పదేపదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు ప్యాకేజీ సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని చెబుతున్నారు. ఏయే రంగాల్లో ఎన్ని నిధులు అవసరమనే విషయం లెక్కలేస్తోందని తెలుస్తోంది.

ప్యాకేజీ ఇవ్వాల్సిందే
ఉమ్మడి రాష్ట్రంలో అరవై ఏళ్లు నష్టపోయిన తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వాల్సిందేనని టిఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. లేదంటే తాము మరో పోరాటానికి సిద్ధమని చెప్పారు. బీహార్ రాష్ట్రానికి రూ.1.25 లక్షళ కోట్ల ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం అదే తరహాలో ఏపీకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వకుంటే ఊరుకోమన్నారు.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, అరవై ఏళ్లు నష్టపోయిన ప్రాంతానికి ప్యాకేజీ ఇవ్వకుండా ఇప్పటి దాకా లాభపడిన వాళ్లకే మేలు చేస్తారా అన్నారు. ఏపీకి ప్యాకేజీ ఇస్తే తమకు అభ్యంతరం లేదని, తెలంగాణకు ఇవ్వకుంటే మాత్రం ఊరుకోమన్నారు.












Click it and Unblock the Notifications