ఎపి పర్యటనలో బాబు: మాటల తూటాలు పేల్చిన టిఆర్ఎస్
హైదరాబాద్: నోటుకు ఓటు కేసు పరిణామాలపై గత రెండు మూడు రోజులుగా మంత్రులతో, ఉన్నతాధికారులతో చర్చిస్తూ తీరిక లేకుండా గడిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వెళ్లారు. పట్టిసీమ ప్రాజెక్టును పరిశీలించారు. గోదావరి పుష్కరాల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో తెలంగాణ మంత్రులు, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకులు ఆయనపై మాటల తూటాలు పేల్చారు.
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు ఆ కేసు నుంచి బయటపడటానికి పడరాని పాట్లు పడుతున్నారని తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అలాంటి కుట్రలు మానుకుని చేసిన తప్పును ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ నుంచి తెలంగాణ రాష్ర్టానికి పోలీసు భద్రతను ఎందుకు తెప్పించుకున్నారో తెలపాలని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ చేస్తోన్న అభివృద్ధి పనులను చూసే ఇతర పార్టీల నేతలు తమ పార్టీలో చేరుతున్నారని వివరించారు.తమ ప్రభుత్వాన్ని చంద్రబాబు నామినేట్ చేయలేదని మంత్రి అన్నారు.
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ కేసు నుంచి బయట పడటానికి నానా యాగి చేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు అవినీతిపరుడు కాకుంటే, ధైర్యముంటే ఏసీబీ విచారణను ఎదుర్కొవాలని ఆయన గురువారం మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.
Photos: ఈటెల రాజేందర్‌కు పరామర్శ
నోటుకు ఓటు కేసు నుంచి బయటపడటానికి చంద్రబాబుకు అన్ని దారులు మూసుకుపోయాయని అన్నారు. ఇక చంద్రబాబు నాయుడు జైలుకు పోయేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. చంద్రబాబు నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను కేసులో ఇరుక్కోగానే చంద్రబాబుకు సెక్షన్-8 గుర్తుకొచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి హైదరాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదని గుర్తు చేశారు. చంద్రబాబు దొంగనే కాకపోతే మంగళగిరి సభలో ప్రభుత్వాన్ని కూల్చివేస్తానని ఎలా అన్నారు.
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆ కేసు నుంచి ఎలాగైనా బయటపడాలని కుట్రలు పన్నుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. కేసులో పీకల్లోతూ కూరుకుపోయిన చంద్రబాబును భగవంతుడు కూడా కాపాడలేరని అన్నారు.

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు కేసు నుంచి తప్పించుకోవడానికి నానా కుట్రలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. కేసు నుంచి తప్పించుకునే కుట్రలో భాగంగా తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.
తెలుగు ప్రజలు కలిసే ఉన్నారని అన్నారు. అవినీతి కేసులో దొరికిపోయిన ఏపీ సీఎంకు పదవిలో కొనసాగే అర్హతలేదని, చంద్రబాబు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికే సెక్షన్-8పై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలు స్టీఫెన్‌సన్‌కు ఇస్తూ పట్టుబడ్డది నిజంకాదా? అని నిలదీశారు. సెక్షన్-8 అంటేఏంటో పార్లమెంట్‌లో అరుణ్ జైట్లీ వివరించారని తెలిపారు.
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేసు నుంచి తప్పించుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని టీఆర్‌ఎస్ నేత పాతూరి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. స్టీఫెన్‌సన్ తనను డబ్బుతో ప్రలోభపెడుతున్నారని ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు వలపన్ని రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌ను పట్టుకున్నారని తెలిపారు. ఈ కేసులో రికార్డయినట్టు చెబుతోన్న వాయిస్ చంద్రబాబుదేనా కాదా? చెప్పాలని పాతూరి డిమాండ్ చేశారు.
అలాగే స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన రూ.50 లక్షలు కూడా తమవేనా కాదా? చెప్పాలని అన్నారు. ఈ కేసులో సీఎం కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని కానీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మంగళగిరి సభలో ప్రజలను చేతులెత్తి చెప్పండని అనడం సరికాదన్నారు. అవినీతి కేసులో ఇరుక్కున్న చంద్రబాబుకు పదవిలో కొనసాగే అర్హతలేదన్నారు. రికార్డయిన వాయిస్ తనదేనని చెప్పి చంద్రబాబు నాయుడు పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు మతిభ్రమించి పొంతన లేకుండా మాట్లాడుతున్నారని, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ వేణుగోపాలాచారి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఆడియోటేప్‌లో ఉన్న స్వరంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అవినీతి కేసు నుంచి బైటపడే మార్గం లేకపోవడంతో ప్రతీకారేచ్ఛతో ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని హైదరాబాద్‌లో దించుతున్నారని విమర్శించారు. తనపై కేసు నమోదుచేసే అధికారం తెలంగాణ ఏసీబీకి లేదని వ్యాఖ్యానిస్తున్న చంద్రబాబుకు తాజాగా ఎన్నికల సంఘం దిమ్మతిరిగే ఆదేశాలను ఇచ్చిందని అన్నారు. నోట్లకట్టలు ఇస్తూ దొరికిపోయిన రేవంత్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications