ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి..!
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఓ తెలంగాణ వాసి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. మృతి చెందిన వ్యక్తిని జగిత్యాల జిల్లాకు చెందిన రవీందర్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఈ విషాద వార్తతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం రవీందర్ ఇజ్రాయెల్ కి వెళ్లినట్టు చెబుతున్నారు. ఇరుదేశాల మధ్య భీకర దాడులు నేపధ్యంలో బాంబుల శబ్దం వల్ల రవీందర్ గుండెపోటుతో మృతి చెందాడని వాపోతున్నారు. మరోవైపు ఇరుదేశాల మధ్య యుద్ధం కారణంగా విమాన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. దాంతో రవీందర్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని అతడి కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ప్రభుత్వం చొరవ తీసుకుని తన భర్త మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని రవీందర్ భార్య వేడుకుంటున్నారు. అంతేకాకుండా తమ కుటుంబాన్ని కూడా ఆర్థికంగా ఆదుకోవాలని కూడా ఆమె ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపగా.. విదేశాల్లో ఉన్న తమ వారి భద్రత గురించి తోటి వలస కార్మికుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇక ఇప్పటికే ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ వాసుల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని.. ప్రభుత్వం ఢిల్లీలో ప్రత్యేక హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు చెందిన సీనియర్ అధికారులు, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు ఇరాన్, ఇజ్రాయెల్‌లలోని భారత రాయబార కార్యాలయాలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ తక్షణ సహాయానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేసింది.
అంతే కాకుండా ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో నలుగురు కీలక అధికారులను ప్రత్యేకంగా నియమిస్తూ, వారి ఫోన్ నంబర్లను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. మరీ ఈ ఘటనపై ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications