చంద్రబాబుతో టీ నేతల కీలక భేటీ: టీ టీడీపీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఆ పార్టీ యువనేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నియమితులు కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో శుక్రవారం ఉదయం తెలంగాణ టీడీపీ నేతలు భేటీ అయ్యారు.
చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీ ముగిసింది. ఈ భేటికి తెలుగుదేశం పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీపీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి నన్నూరి నర్సిరెడ్డి, రాములు తదితర సీనియర్ నేతలు ఈ భేటీకి హాజరయ్యారు.

తెలంగాణ టీడీపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. ఈ భేటీలో చంద్రబాబు ‘ఐవీఆర్ఎస్' (ఇంటిగ్రేటెడ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం) ద్వారా పార్టీ క్రియాశీల కార్యకర్తల నుంచి సేకరించిన అభిప్రాయాలను ప్రస్తావించారు. ఈనెల 23న లేదా 24వ తారీఖున మరోసారి సమావేశమవుదామని చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ భేటీలో ముగ్గురు జనరల్ సెక్రటరీల ఉండేలా కమిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. అయితే నేతలు మాత్రం ఐదుగురు సెక్రటీలు ఉండే బాగుంటుందని సూచించారని తెలుస్తోంది. రాష్ట్ర కమిటీలో తెలంగాణలోని ప్రతి జిల్లా నుంచి ఒకరు ఉండేలా కూర్పు చేయాలని సూచించారు.
గత వారం చంద్రబాబు నాయుడుని విజయవాడలో కలిసినప్పుడు ‘ఐవీఆర్ఎస్' ద్వారా పార్టీ కార్యకర్తల నుంచి సమాచారాన్ని సేకరించి అధ్యక్షుడిని ఎంపిక చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి నాలుగు లక్షల మంది కార్యకర్తలున్నారు.
మెజారిటీ పార్టీ కార్యకర్తలు పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించారట. ఇదే విషయాన్ని చంద్రబాబు పార్టీ నేతల ముందుంచినట్లు తెలుస్తోంది. మొదటి నుంచి కూడా పార్టీ కార్యకర్తల అభిప్రాయలకు విలువనిచ్చే చంద్రబాబు ‘ఐవీఆర్ఎస్'కే ఆమోదం తెలిపితే తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపిక లాంఛనం అవుతుంది.
అయితే పార్టీలో సీనియర్ల కోరిక మేరకు చంద్రబాబు ప్రస్తుత అధ్యక్షుడు ఎల్.రమణనే అధ్యక్షుడిగా కొనసాగిస్తారని వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణా టీడీపీ శాఖను మొత్తం 65 మందితో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయా పోస్టులకు ఏఏ నేతలైతే సరిపోతారన్న విషయాలపైనా పార్టీ ఐటీ విభాగం ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలను సేకరించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications