జోగినిపల్లి సంతోష్ సహకారంతో ‘కిలిమంజారో’ను అధిరోహించిన బానోతు వెన్నెల
ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సహకారంతో తెలంగాణకు చెందిన గిరిజన విద్యార్థిని బానోతు వెన్నెల.. దక్షిణాఫ్రికాలోని టాంజానియా కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు.
హైదరాబాద్: సామాజిక, సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుందే బీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఆయన సహకారంతో తెలంగాణకు చెందిన గిరిజన విద్యార్థిని బానోతు వెన్నెల.. దక్షిణాఫ్రికాలోని టాంజానియా కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమవారంపేట గ్రామానికి చెందిన బానోతు వెన్నెల 2023 జనవరి 23న కిలిమంజారో పర్వత శిఖరానికి చేరుకుంది. 5895 మీటర్ల ఈ పర్వతాన్ని అధిరోహించింది. ఈ క్రమంలో తన కలను సాకారం చేసుకునేందుకు రూ. 3 లక్షల ఆర్థికం సాయం చేసి సహకరించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు బానోతు వెన్నెల కృతజ్ఞతలు తెలిపింది.

కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించిన అనంతరం వెన్నెల.. సీఎం కేసీఆర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపింది. పర్వత శిఖరాన్ని అధిరోహించిన సందర్భంగా కేసీఆర్, సంతోష్ కుమార్‌ల ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీని వెన్నెల ప్రదర్శించింది.
కాగా, వెన్నెలకు చిన్నతనం నుంచి పర్వత అధిరోహణ చేయడం అంటే ఇష్టం. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎవరెస్ట్ (8840 మీటర్లు) పర్వతాన్ని అధిరోహిస్తానని బానోతు వెన్నెల ఈ సందర్భంగా తెలిపింది.

వెన్నెల కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. పర్వతారోహకురాలైన వెన్నెలకు అభినందనలు తెలిపారు. వెన్నెల తనకు, తన కుటుంబానికే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రానికి కీర్తిని తెచ్చిపెట్టిందని ప్రశంసించారు. ఆమె భవిష్యత్తులో చేయనున్న ప్రయత్నాలు విజయవంతం కావాలని సంతోష్ ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications