తెలంగాణలో ఎవరి గెలుపు ఏపీలో ఎవరికి కలిసొచ్చేను..!!
తెలంగాణలో మరి కొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. గెలుపు కోసం ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా తల పడుతున్నాయి. ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది డిసెంబర్ 3న తేలనుంది. తెలంగాణ లో ఎన్నికల ఫలితాల పైన ఏపీలో ఆసక్తి కనిపిస్తోంది. ఇక్కడ వచ్చే ఫలితాలు ఏపీ ఎన్నికల రాజకీయం పైనా ప్రభావం చూపనుంది. దీంతో, ఎవరు గెలుస్తారు..ఏపీలో ఏ పార్టీకి ఇక్కడ ఫలితం కలిసొస్తుందనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది.
ప్రజా తీర్పుపై ఉత్కంఠ:తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు రేపు (గురువారం) పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తమదే అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే అసలు ప్రజలు ఎవరికి అధికారం అప్పగిస్తారనేది తేలిపోనుంది. తెలంగాణ ఎన్నికల ఫలితం ఏపీ రాజకీయాల్లోనూ ప్రభావితం చేస్తుందనే విశ్లేషణలు ఉన్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ మూడో సారి విజయం సాధిస్తే పరోక్షంగా వైసీపీకి అనుకూల చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. పాలన..పథకాల వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారనే వాదనకు మద్దతు ఉంటుంది. సంక్షేమానికి ప్రజలు పట్టం కడుతున్నారని..దానినే నమ్ముకున్న జగన్ కు తిరిగి అధికారం దక్కుతుందనే అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ గెలిస్తే టీడీపీ తమకు అనుకూలంగా ప్రచారం చేసుకొనే ఛాన్స్ ఉంది.

ఏపీ పైనా ప్రభావం:తెలంగాణలో కేసీఆర్ పాలన..వ్యవహార శైలికి వ్యతిరేకంగా ఓటర్లు వ్యతిరేకంగా ఉన్నారని..ఏపీలోనూ పాలన పైన వ్యతిరేకత ఉందంటూ ప్రచారం ప్రారంభించటం ఖాయం. జగన్ మారాలి అనే నినాదం అందిపుచ్చుకొనే ఛాన్స్ కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ కు టీడీపీ అనుకూలంగా ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. బీజేపీకి మద్దతుగా జనసేన నిలిచింది. ఏపీలో ఈ రెండు పార్టీలు జత కట్టాయి. తెలంగాణలో బీసీ సీఎం నినాదం వినిపించిన బీజేపీ...ఏపీలో ఏం చేస్తుందనేది మరో ఆసక్తి కర అంశం. టీడీపీ,బీజేపీ,జనసేన కలిస్తే ఒక లెక్క...వేర్వేరుగా పోటీ చేస్తే మరో లెక్క ఉండనుంది. అదే సమయంలో కాంగ్రెస్ గ్యారంటీ పథకాలే ఆ పార్టీని గెలిపిస్తే..వైసీపీ తమ సంక్షేమమే ఏపీలోనూ గెలిపిస్తుందని చెప్పుకొనే అవకాశాలు ఉన్నాయి. ఏపీ కాంగ్రెస్ లోనూ ఎంతో కొంత పుంజుకోవటానికి ప్రయత్నాలు మొదలవుతాయి. బీజేపీ నాయకత్వం టీడీపీతో జత కట్టేందుకు ముందుకు రాకపోతే..ఏపీలో కొత్త పొత్తులు తెర మీదకు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
మారుతున్న లెక్కలు:అయితే, తెలంగాణలో ఏ పార్టీ గెలిచినా ఏపీ పైన ప్రభావం ఉంటుందనే వాదనలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 2014 లో తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. కానీ, 2018 లో కేసీఆర్ రెండో సారి గెలిచినా..చంద్రబాబు అధికారం కోల్పోయిన అంశాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో గెలుపు కోసం కాంగ్రెస్ ఏడాది కాలంగా కసరత్తు చేస్తోంది. వాస్తవంగా ఏపీలో వైసీపీ ఎన్నికల కార్యాచరణలో ముందుంది. ఇప్పటి వరకు టీడీపీ-వైసీపీ ఇంకా ఎన్నికలకు సిద్దం కాలేదు. ఏపీలో భిన్న రాజకీయ వాతావరణం ఉంది. అయితే, తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత ఏపీలోని పార్టీలకు తమ పొరపాట్లను సరిచేసుకోవటం.. కొత్త వ్యూహాలను అమలు చేయటానికి దిక్సూచీగా మారుతుంది. దీంతో..ఇప్పుడు ఏపీలోనూ తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications