హైదరాబాద్ లో చలి పంజా.. ఉత్తరాది జిల్లాల్లో భారీ వర్షాలు..
గత కొద్ది రోజులుగా తెలంగాణలో భిన్న వాతావరణం నెలకొంది. హైదరాబాద్ లో చలి ప్రభావం క్రమక్రమంగా పెరుగుతోంది. నగరంలో సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 10 రోజుల పాటు ఇదే తరహా వాతావరణం కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. అటు ఉత్తర దిశ నుంచి వీస్తున్న పొడి చల్లటి గాలుల ప్రభావంతో పశ్చిమ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. పగటిపూట తేమ శాతం తక్కువగా ఉండటంతో వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నగర శివారు ప్రాంతాలైన రాజేంద్ర నగర్, పటాన్ చెరుతోపాటు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు 12 నుంచి 16 డిగ్రీల సెల్షియస్ వరకు పడిపోతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు చలి తీవ్రత దృష్ట్యా పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక అక్వాన్ తుపాను ప్రభావం తెలంగాణపై పెద్దగా ప్రభావం చూపదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తుపాను కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో అక్వాన్ తుపాను తీరం దాటిన అనంతరం నవంబర్ 22 నుంచి హైదరాబాద్ లో రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా అంచనా వేసింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల సెల్సియస్ కు చేరవచ్చని స్పష్టం చేసింది. నవంబర్ 25 వరకు నగరంలో చల్లటి, పొడి వాతావరణం కొనసాగనుందని పేర్కొంది. హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘామృతమై.. పొగమంచు వాతావరణం కనిపించే అవకాశం ఉందని వివరించింది.












Click it and Unblock the Notifications
