గుడి-మసీద్-చర్చి: కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభానికి ముహూర్తం ఖరార్..!!
హైదరాబాద్: తెలంగాణ పరిపాలన కేంద్రబిందువు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం.. సర్వమత సమ్మేళనానికి అద్దం పట్టబోతోంది. సచివాలయం ఆవరణలో కొత్తగా నిర్మించిన గుడి, మసీదు, చర్చి నిర్మాణం తుది దశకు చేరుకుంది. చిన్న చిన్న పనులు మినహా నిర్మాణం మొత్తం పూర్తయింది.
ఈ నిర్మాణ పనులను రోడ్లు- భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇవ్వాళ పరిశీలించారు. ఆర్ అండ్ బీ మంత్రిత్వ శాఖ అధికారులు ఆయన వెంట ఉన్నారు. నిర్మాణ పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిన్న చిన్న పనులు మినహా నిర్మాణం మొత్తం పూర్తయినట్లు అధికారులు వివరించారు.

సచివాలయం ఆవరణలో నిర్మించిన గుడిలో శివుడు, గణపతి, పోచమ్మ, హనుమంతుడి ఆలయాలు ఉన్నాయి. ఆయా దేవుళ్ల విగ్రహాలను తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర శిల్ప కళాశాల నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి తెప్పించినట్లు తెలుస్తోంది. గుడి, మసీదు, చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా సర్వమత సమ్మేళనాన్ని నిర్వహించనుంది ప్రభుత్వం.
ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ మూడు ప్రార్థన మందిరాలను ప్రారంభించనున్నారు. సర్వ మతాలను గౌరవించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం- పరిపాలన కేంద్రబిందువైన సచివాలయంలో గుడి, మసీదు, చర్చిలను నిర్మాణాలను చేపట్టింది. సచివాలయంతో పాటు వాటినీ ప్రారంభించాలని మొదట్లో భావించినప్పటికీ.. నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో సాధ్యపడలేదు.

ఆగస్టు 25వ తేదీ నాటికి వాటిని ప్రారంభించాలని అప్పట్లోనే కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఈ మూడు ప్రార్థన మందిరాల నిర్మాణాన్ని చేపట్టింది. నిర్మాణ పనులను పర్యవేక్షించిన అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. పాలనలో అన్ని వర్గాల వారూ సుఖసంతోషాలతో జీవిస్తోన్నారని అన్నారు.
గంగా-జమునా తెహజీబ్ అనే స్ఫూర్తిని కొనసాగించేలా తమ ప్రభుత్వ పాలన ఉంటోందని, అన్ని మతాల వారు సోదర భావంతో మెలగాలనేదే తమ అభిమతమని చెప్పారు. రాష్ట్రం ఏ రకంగా సమగ్రాభివృద్ధి చెందుతోందో.. అదే విధంగా అన్ని వర్గాల వారు, కుల, మతాలకు అతీతంగా పురోగమిస్తోన్నారని అన్నారు.












Click it and Unblock the Notifications