నిర్మల్ జిల్లాలో పాము పిల్లల కలకలం..
అనూహ్యంగా నివాస ప్రాంతాల్లో ఒక్కసారిగా పదుల సంఖ్యలో పాము పిల్లలు ప్రత్యక్షం కావడం కలకలం రేగింది. ఇళ్ల ముందు, వీధుల్లో, అలాగే ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో ఈ పాము పిల్లలు కనిపించడంతో ప్రజలు ఒక్కసారిగా గాబరా పడ్డారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలోని కుబీర్ మండలం జాంగాం గ్రామంలో అనూహ్య ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
స్థానికుల వివరాల ప్రకారం.. రాత్రి వేళలో ఒక్కసారిగా ఈ పాము పిల్లలు బయటకు రావడం ప్రారంభమైందంటున్నారు. కొన్ని ఇళ్ల ప్రాంగణాలు, గోడల చుట్టూ, చెత్త పేరుకుపోయిన ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపించాయని తెలిపారు. ఒకేసారి ఇంత సంఖ్యలో పాములు కనిపించడం గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేయడంతో పాటు భయానికి గురిచేసింది. పిల్లలు ఆడుకునే ప్రదేశాల్లో కూడా ఈ పాము పిల్లలు కనిపించడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మరింత పెరిగింది.

కాగా ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశముందన్న భయంతో పిల్లలను బయటకు పంపేందుకు వెనుకాడుతున్నారు. రాత్రివేళ మాత్రమే కాకుండా పగటిపూట కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పాము పిల్లలు ఎక్కడి నుంచి వచ్చాయన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియకపోవడం స్థానికుల్లో అనుమానాలను రేకెత్తిస్తోంది. సమీపంలో ఎక్కడైనా పాము గూడు ఉండి ఉండవచ్చని, లేదా ఇటీవల కురిసిన వర్షాల కారణంగా బిలాలు నిండిపోవడంతో పాములు బయటకు వచ్చి ఉండవచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు.
ఇక పాము పిల్లలు ఇంత సంఖ్యలో కనిపించడంతో సమీపంలో పెద్ద పాములు కూడా ఉండే అవకాశముందనే భయం గ్రామంలో నెలకొంది. అవి విషపూరిత జాతికి చెందినవేమో అన్న అనుమానంతో ప్రజలు మరింత అప్రమత్తంగా మారారు. ఈ ఘటనపై గ్రామస్తులు వెంటనే అటవీ శాఖ, స్థానిక అధికారులకు సమాచారం అందించారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తూ, పాము పిల్లలను సురక్షితంగా తొలగించే చర్యలు చేపట్టారు. ప్రజలు భయపడకుండా ఉండాలని, పాములు కనిపిస్తే స్వయంగా పట్టుకునేందుకు ప్రయత్నించకుండా నిపుణులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఇళ్ల చుట్టూ చెత్త, పొదలు పేరుకుపోకుండా శుభ్రంగా ఉంచుకోవాలని, రాత్రివేళ బయటకు వెళ్లేటప్పుడు టార్చ్‌లైట్ ఉపయోగించాలని, పిల్లలను ఒంటరిగా బయటకు పంపకూడదని అధికారులు సూచించారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించుకోవచ్చని తెలిపారు. ఈ ఘటనతో జాంగాం గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది. అధికారులు పూర్తిగా పరిస్థితిని అదుపులోకి తెచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications