TGSRTC ఏసీ బస్సుల్లో భారీగా చార్జీల తగ్గింపు- ఈ రూట్లలో కొత్త ధరలు ఇలా...!!
ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ పరిధిలో పలు మార్గాల్లో నడిచే ఈ బస్సుల్లో 40 శాతం మేర టికెట్ ధరలు తగ్గిస్తూ ప్రకటన చేసింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి శంషాబాద్ రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టుకు నడుపుతున్న పుష్పక్ ఏసీ బస్సుల్లో ఈ ఛార్జీల తగ్గింపు వర్తిస్తుందని ఆర్టీసీ ప్రకటించింది. సవరించిన నూతన చార్జీలు ఈ రోజు (అక్టోబర్ 7) నుంచి అమలులోకి రానున్నాయి. దీని ద్వారా క్యాబ్ ఛార్జీల కంటే బస్సుల వైపు ప్రయాణీకులు ఎక్కువగా ఆదరణ చూపే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీపి కబురు అందించింది. ఎయిర్‌పోర్ట్‌కు నడిచే ఏసీ 'పుష్పక్' బస్సు చార్జీలను ఏకంగా 40 శాతం వరకు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా నిర్ణయించిన ధరల మేరకు మియాపూర్ ఎక్స్‌రోడ్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు ఇప్పటివరకు ఉన్న రూ. 350 చార్జీని రూ. 250కి తగ్గించగా, జేఎన్‌టీయూ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు రూ. 350గా ఉన్న రుసుమును రూ. 200కి కుదించారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే గచ్చిబౌలి నుంచి ఎయిర్‌పోర్ట్ మార్గంలో చార్జీని రూ. 300 నుంచి ఏకంగా రూ. 150కి తగ్గించి సగానికి సగం భారాన్ని తగ్గించారు.

క్యాబ్ ఛార్జీల భారం తగ్గేలా
అదే విధంగా సికింద్రాబాద్ జేబీఎస్ (JBS) నుంచి ఎయిర్‌పోర్ట్‌కు రూ. 350గా ఉన్న చార్జీ ఇకపై రూ. 200 మాత్రమే కానుండగా, లింగంపల్లి, ఆల్విన్ ఎక్స్‌రోడ్, కొండాపూర్ ప్రాంతాల నుంచి రూ. 150 నుంచి రూ. 200 వరకు తగ్గించారు. నగరంలోని పలువురు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు ప్రైవేట్ క్యాబ్‌లు, టాక్సీలను ఆశ్రయించి వేల రూపాయలు వెచ్చించే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం ఊరటగా మారనుంది. సౌకర్యవంతమైన, సురక్షితమైన ఏసీ పుష్పక్ బస్సుల్లో ఇప్పుడు అతి తక్కువ ధరలోనే విమానాశ్రయానికి చేరుకునే వెసులుబాటు లభించింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ప్రయాణికులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకుని సురక్షితంగా ప్రయాణించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.













Click it and Unblock the Notifications
