ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్- ఇక సెల్ఫ్ టికెట్ విధానం, ఈ సర్వీసుల్లో..!!
ప్రయాణీకులకు ఆర్టీసీ కీలక అప్డేట్ ఇచ్చింది. టికెట్ జారీలో సమస్యలకు చెక్ పెట్టేలా కొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది. కండక్టర్ లేకుండానే నేరుగా ప్రయాణీకుడే టికెట్ పొందే విధానం ప్రవేశ పెట్టింది. ముందుగా ఎంపిక చేసిన సర్వీసుల్లో.. ఖరారు చేసిన రూట్లలో ఈ విధానం అమలు చేయనున్నారు. దశల వారీగా అన్ని సర్వీసుల్లోనూ అమలు చేసే విధంగా కార్యాచరణ ఖరారు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా టికెట్ కష్టాలు తొలిగిపోనున్నాయి.
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణీకుల కోసం కొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది. నాన్‌స్టాప్ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ తీసుకునే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు సెల్ఫ్ టికెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. కండక్టర్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా.. ప్రయాణికులే తమ టికెట్‌ను స్వయంగా బుక్ చేసుకునే అవకాశం ఈ విధానం ద్వారా కలగనుంది. ఇందులో భాగంగా బస్సు ప్రవేశ ద్వారం వద్ద క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్‌తో ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే టికెట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభం అమవుతుంది. అనంతరం ఎక్కడి నుంచి బస్సు ఎక్కుతున్నారో, ఏ స్టాప్‌లో దిగాలను కుంటున్నారో వివరాలను నమోదు చేయటంతో ఫోన్ కు మెసేజ్ వస్తుంది. ఆన్‌లైన్‌లో చెల్లింపు పూర్తిచేసిన వెంటనే టికెట్ జనరేట్ అవుతుంది.

ప్రయాణీకులకు వెసులుబాటు కల్పించేలా
దీని ద్వారా బస్సులోకి ఎక్కిన తర్వాత ఆ టికెట్‌ను డ్రైవర్‌కు చూపిస్తే ప్రయాణం కొనసాగించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. కాగా.. ఈ సెల్ఫ్ టికెట్ విధానం తొలుత నల్గొండ-హైదరాబాద్ మార్గంలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ మార్గంలో సుమారు 45 డీలక్స్ నాన్‌స్టాప్ బస్సులు నడుస్తున్నాయి. ఈ రూట్‌లో సెల్ఫ్ టికెట్ విధానం అమలు పరిశీలించి.. ప్రయాణీకుల స్పందనకు అనుగుణంగా ఇతర మార్గాల్లో విస్తరించే దిశగా ఆలోచన చేస్తున్నారు. నాన్ స్టాప్ సర్వీసుల్లో ప్రవేశ పెట్టటం ద్వారా కండక్టర్ల పైనా భారం తగ్గించే విధంగా ఈ నిర్ణయం మేలు చేస్తుందని చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్ లేని వారు లేదా ఆన్‌లైన్ చెల్లింపులు చేయడం తెలియని ప్రయాణికులు మాత్రం సాధారణ పద్ధతిలో డ్రైవర్ వద్ద టికెట్ తీసుకుని ప్రయాణించవచ్చని స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications