తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచంటే?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా దసరా పండగ సెలవులను ప్రకటించింది. రాష్ట్రంలోని స్కూల్స్, కాలేజీలకు దసరా సెలవులను ప్రకటిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దసరా పండగ నేపథ్యంలో మొత్తం 13 రోజుల పాటు సెలవులను డిక్లేర్ చేసింది ప్రభుత్వం. అక్టోబర్ 2వ తేదీ(బుధవారం) నుంచి 14వ తేదీ(సోమవారం) వరకు సెలవులుగా ప్రకటించింది.
అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతితో సెలవులు మొదలు కానున్నట్లు పేర్కొంది. ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించాయి. ఇక జూనియర్ కాలేజీల విషయానికి వస్తే అక్టోబర్ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది.

అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు అంటే మొత్తంగా 13రోజులు సెలవుల తర్వాత అక్టోబర్ 15(మంగళవారం) రోజున విద్యాలయాలు పునఃప్రారంభం కానున్నాయి. ఇక కాలేజీలు అక్టోబర్ 14న తెరుచుకోనున్నాయి. వరుసగా 13 రోజులు సెలవులు రావడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పండగను ఎంజాయ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం మే 25వ తేదీన 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి క్యాలెండర్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు దసరా సెలవులు, డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు, జనవరి 13 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది. ఇక 2025, ఏప్రిల్ 23వ తేదీ వరకు పాఠశాలలు కొనసాగుతాయని, 2025 ఫిబ్రవరి 28వ తేదీ లోపు పదో తరగతి ప్రి ఫైనల్ పరీక్షలు పూర్తి చేయనున్నట్లు తెలిపింది. 2025 మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు.
కాగా, ఇటీవల తెలంగాణలో భారీ వర్షాల కారణంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 14, 15, 16తేదీల్లోనూ సెలవులు వచ్చాయి. 17వ తేదీన కొన్ని ప్రాంతాల్లో వినాయక నిమజ్జనం సందర్భంగా సెలవు ఇచ్చారు. సెప్టెంబర్ 22, 28, 29 తేదీల్లోనూ స్కూళ్లకు సెలవు రానుంది. దీంతో సెప్టెంబర్, ఆక్టోబర్ నెలలో స్కూళ్లకు ఎక్కువగా సెలవులు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications