కేసీఆర్ సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదు.!చెరువుల పండగలో కల్వకుంట్ల కవిత.!!
బోధన్/హైదరాబాద్: తెలంగాణలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందని ఇల్లే లేదని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఏం చేశారని సంబరాలు జరుపుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలు ఇంటింటికి తిరిగి ఫలాలు ఎలా అందుతున్నాయో చూడాలని సవాల్ విసిరారు. మంచి పనులు చేయడంలో దేశానికి తెలంగాణ ఉదాహరణగా నిలిచిందని తెలిపారు. మిషన్ కాకతీయ పథకాన్ని కాపీ కొట్టిన కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవర్ పేరిట అమలు చేస్తున్న కార్యక్రమం విఫలమైందనియ కవిత విమర్శించారు.
మంచి పనుల్లో దేశానికి తెలంగాణ ఉదాహరణ : తెలంగాణ దశాబ్ది ఉత్సవంలో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లిలో జరిగిన చెరువుల పండుగ లో స్థానిక ఎమ్మెల్యే షకీల్ తో కలిసి కవిత పాల్గొని ప్రసంగించారు. చెరువులను బాగు చేయాలన్న ఆలోచన వెనుక ఉన్నలక్ష్యం గురించి ప్రజలు తెలుసుకోవాలన్నారు కవిత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు 75 ఏళ్ల క్రితం చెరువులు నిండుకుండలా ఉండేవని, ప్రజల జీవితమంతా చెరువు చుట్టే ఉండేదని గుర్తు చేశారు. చెరువు బాగుంటే ఊరుఊరంతా చెరువుపై ఆధారపడి బ్రతికే పరిస్థితి అని తెలిపారు. ప్రపంచంలో ఏ దేశంలో అయినా చెరువు, నది ఉంటే ఆ సంస్కృతి, జనజీవితం వాటిపై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు.















Click it and Unblock the Notifications