ఇంట్లో దొంగిలించిన సొమ్ముతో విమాన టిక్కెట్లు: ఐఎస్ మహిళతో హైదరాబాదీల సంప్రదింపులు
హైదరాబాద్: ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లో సభ్యులుగా చేరేందుకు యత్నించిన నగరానికి చెందిన ముగ్గురు యువకులు అబ్దుల్లా బాసిత్, ఫరూక్ హుస్సేన్, మాజ్ హస్సన్‌లు కాశ్మీర్‌లోని ఐఎస్‌ఐఎస్ బాధ్యురాలు, ధుక్తరాన్-ఎ-మిల్లత్ సంస్థ నాయకురాలు ఆసియాన్ అంద్రాబీతో సంప్రదించినట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు.
ఆమెతో మాట్లాడి సరిహద్దు దాటేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న వీరిని నాగ్‌పుర్‌లో అరెస్ట్‌చేసి సోమవారం రిమాండ్‌కు తరలించామన్నారు. వీరిపై దేశభద్రతకు భంగం కలిగించే చర్యలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై ఐపీసీ 121, 121-ఎ, రెడ్‌విత్ 120(బి), 13 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వివరించారు.
కాగా, అబ్దుల్లా బాసిత్ తాము ‘స్వర్గాని'కి వెళ్తున్నామని లేఖరాసి పరారయ్యాడు. తాము పవిత్ర యుద్ధంలో పాల్గొనేందుకు వెళ్తున్నామంటూ వాంగ్మూలం ఇచ్చారని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇంటర్నెట్ ద్వారా వీరు ఎంతమందితో సంభాషించారు? ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సభ్యులతో నేరుగా సంబంధాలున్నాయా? ఆర్థికంగా వీరికి ఎవరైనా సహకరిస్తున్నారా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.

కాగా, ఈ ముగ్గురు యువకులు 2014 సెప్టెంబర్‌లో కూడా ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు ప్రయత్నించారు. అప్పుడు కూడా అరెస్ట్ చేసిన పోలీసులు, కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. అయినా వారిలో ఎలాంటి మార్పులేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా వారం క్రితం మరోసారి ఉగ్రవాద సంస్థలో చేరేందుకు ప్రయత్నించి నాగ్‌పూర్ విమానాశ్రయంలో పోలీసులకు పట్టుబడ్డారు.
అదుపులోకి తీసుకున్న ఈ ముగ్గుర్ని ఐబి అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే ఓసారి కౌన్సెలింగ్ ఇచ్చామని, అయినా వారిలో ఎలాంటి మార్పు రాలేదని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే వారిని విచారిస్తున్నామని తెలిపారు. ఈ ముగ్గురు యువకులు ఐఎస్ లేదా ఆల్‌ఖైదా ఉగ్రవాద సంస్థలో చేరేందుకు ప్రయత్నించారని చెప్పారు.
హైదరాబాద్ నగరంలోని చాంద్రయణాగుట్ట, మెహదీపట్నంలకు చెందిన వీరు నేరుగా నాగ్‌పూర్ చేరుకున్నారని చెప్పారు. ఇక్కడే పోలీసులకు పట్టుబడ్డ వీరిని అధికారులు తిరిగి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.
ఈ ముగ్గురి వద్ద నుంచి రూ.31,800 నగదు, రెండు మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వాటిని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపినట్లు తెలిపారు. వీరందరూ వారిళ్లల్లో సుమారు రూ. 90వేల నగదును దొంగిలించి విమాన టిక్కెట్లు కొనుగోలు చేశారు.












Click it and Unblock the Notifications