తెలంగాణాలో మూడునెలలు భానుడి భగభగలు.. నేటినుండి వరుణుడి పలకరింపులు!
మార్చి నెలలోనే ఎండలు నిప్పుల కుంపటిని తలపించాయి. ప్రస్తుతం ఏప్రిల్ మాసంలో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని, సాధారణం కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో వడగాలులు ఎక్కువగా కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని imd వెల్లడించింది.
మూడునెలలు తీవ్ర వడగాలులకు అవకాశం
రాబోయే మూడు నెలల పాటు అనేక ప్రాంతాలలో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, సాధారణం కంటే రెండు నుంచి మూడు నాలుగు రోజులపాటు ఎక్కువగా వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కనుక మూడు నెలలు ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో వర్షాలకు అవకాశం
సహజంగా ఈ మూడు నెలలలో నాలుగు నుంచి ఏడు రోజుల వరకు వడగాలులు నమోదు అవుతాయి కానీ ఈసారి ఇవి మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇదే సమయంలో మూడు నెలల నిప్పుల కుంపటికి ముందు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది.
వడగళ్ళ వానలు పడే చాన్స్
రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
కొన్ని జిల్లాలలో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నేడు, రేపు, ఎల్లుండి చాలా ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఈ జిల్లాలలో వర్షాలు
గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదు అవుతాయని పేర్కొంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, వనపర్తి, గద్వాల, వికారాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాల ప్రజలు, రైతాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.












Click it and Unblock the Notifications