కోమటిరెడ్డిపై హైకమాండ్ సీరియస్ - కీలక నిర్ణయం..!?
తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరుసగా చేస్తున్న వ్యాఖ్యల పైన పార్టీ నాయకత్వం సీరియస్ అయినట్లు సమాచారం. దీంతో, టీపీసీసీ కోమటిరెడ్డి వ్యాఖ్యల పైన క్రమశిక్షణా కమిటీతో చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి విషయంలో రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు.. వివాదాస్పదంగా మారటంతో ఇప్పుడు పార్టీ ఏ చర్యలు తీసుకుంటుందనేది ఉత్కంఠ పెంచుతోంది.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ వ్యవహారం పైన టీపీసీసీ చీఫ్ స్పందించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాజగోపాల్ వ్యాఖ్యలను పరిశీలన చేస్తున్నామని మహేష్ గౌడ్ తెలిపారు. ఆయన గురించి క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎందుకు అలా మాట్లాడారు..ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో తెలుసుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. అయితే, వరుసగా చేస్తున్న ఈ వ్యాఖ్యల పైన పార్టీ హైకమాండ్ సైతం ఆరా తీసినట్లు తెలుస్తోంది.

తనకు మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో.. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై గతంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్‌లోకి వచ్చా అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో జూనియర్లకు మంత్రిపదవి ఇచ్చి తనను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరి ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్పారని తెలిపారు. ఇకపై తాను ఎంత దూరమైనా వెళ్తానని తేల్చి చెప్పారు. మనసు చంపుకుని బతకడం తన వల్ల కాదన్నారు. ప్రజల కోసం మరోసారి పదవీ త్యాగానికైనా రెడీ అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక, ఇప్పుడు పార్టీ తీసుకునే చర్యల పైన ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications