Mahesh Kumar Goud: అన్ని తానై చూసుకుంటున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్..!
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన తర్వాత మహేశ్ కుమార్ గౌడ్ కొన్ని కఠిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. మంత్రి కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీ గురించి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ను ఇరకాటంలో పడేసింది. ఆ తర్వాత కొండా సురేఖ సమంతకు క్షమాపణలు చెప్పినా నాగార్జున కోర్టు కు ఎక్కారు. ఈ విషయాన్ని విడిచి పెట్టాలని మహేశ్ కుమార్ గౌడ్ కోరారు. తాజాగా ఎమ్మెల్సీ, మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి వ్యవహారం పీసీసీకి తలనొప్పిగా మారింది.
జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్న గంగా రెడ్డి హత్యతో జీవన్ రెడ్డి ఆవేదనతో ఉన్నారు. హత్యకు నిరసనగా జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా స్పందించారు. హత్య చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీరియస్ తీసుకుందని చెప్పారు. పోలీసులు కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యే మాట వింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మహేశ్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగాల్సి వచ్చింది.

జీవన్ రెడ్డితో స్వయంగా మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడినట్లు పేర్కొన్నారు. జీవన్ రెడ్డి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా జగిత్యాలలో జరుగుతున్న విషయాలను జీవన్ రెడ్డి మహేశ్ కుమార్ గౌడ్ తో ప్రస్తావించినట్లు తెలిసింది. తాజాగా మహేశ్ కుమార్ గౌడ్ హైడ్రా, మూసీపై కూడా మాట్లాడారు. ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తమ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిందని వివరించారు.
కేటీఆర్ యూట్యూబ్ ఛానళ్లు కొనుగోలు చేసి కాంగ్రెస్ పై విష ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. గులాబీ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 70 వేల ఉద్యోగాలు ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తు చేశారు. మూసీ నది ప్రక్షాళన చేసి హైదరాబాద్ ను అద్దంలా తీర్చిదిద్దుతామని చెప్పారు. మొత్తంగా టీపీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ ను ముందు తీసుకెళ్తున్నారు మహేశ్ కుమార్ గౌడ్.












Click it and Unblock the Notifications