మగాడివైతే ప్రభుత్వాన్ని రద్దు చేయి?.. దమ్ముంటే మళ్లీ గెలువు !? : కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన చేతగాక అద్దెకు మనుషులను తెచ్చుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రం ఏర్పడ్డాక కల్వకంట్ల కుటుంబం బాగుపడిందే తప్ప సామాన్యులకు ఎలాంటి ప్రయోజనంలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ వారికి ఉద్యోగాలు వచ్చాయి. కానీ, నిరుద్యోగ యువత మాత్రం మొండిచెయి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వాన్ని రద్దు చేసి దమ్ముంటే మళ్లీ గెలువు
సీఎం కేసీఆర్ మగాడైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే మళ్లీ గెలవాలని చాలెంజ్ చేశారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నీళ్లు, నిధులు , నియామాకాల పేరిట తెచ్చుకున్న తెలంగాణలో అడుగడుగునా నిరుద్యోగ యువతకు అన్యాయమే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టాలి..
అసెంబ్లీ సాక్షిగా 2014లో లక్షా 50 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్న కేసీఆర్ .. యువతను నిలువునా మోసం చేశారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసిన కేసీఆర్ ఉద్యోగాన్ని ఊడగొట్టేందుకు నిరుద్యోగులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వాళ్లు కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడని హితవు పలికారు. ప్రగతి భవన్ బానిస ఎమ్మెల్యే బాల్కసుమన్ అని మండిపడ్డారు. కేసీఆర్ దుర్మార్గాలతో ఎంతో మంది పేదింటి బిడ్డలు, నిరుద్యోగులు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎంకు చేతగాకనే ప్రశాంత్ కిషోర్ రాక
ఎంత మంది ప్రశాంత్ కిషోర్‌లు వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుపు ఆపలేరని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చేతగాకనే బీహార్ నుంచి ప్రశాంత్ కిషోర్‌ను తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి తప్పక వస్తుందని.. ఆ బాధ్యత తనదేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రగతి భవన్‌ను అంబేద్కర్ నాలెడ్జి సెంటర్‌గా మారుస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చి పోరాడితే.. కేసీఆర్ కుటుంబం అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు రేవంత్ రెడ్డి.












Click it and Unblock the Notifications