పట్టపగలే దోపిడీ దొంగల బీభత్సం: కళ్లలో కారం చల్లి.. రూ. 11లక్షల చోరీ
హైదరాబాద్: నగరంలో పట్టపగలే దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి కళ్లలో కారం పొడి చల్లి భారీ మొత్తంలో నగదు అపహరించుకుపోయారు. ఈ ఘటన నగరంలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. రాజేంద్రనగర్ పట్టణ ప్రాంతంలోని కాటేదన్ పారిశ్రామిక వాడలోని అంకిత్ బిస్కెట్ కంపెనీ నుంచి పాయల్ బిస్కెట్ కంపెనీలో క్యాషియర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ రూ.11.45 లక్షలు తీసుకొని బైకుపై బయలుదేరాడు. కాగా, రెండు బైకులపై వచ్చిన నలుగురు దుండగులు అతడ్ని అడ్డుకున్నారు. ఓ వ్యక్తి ఎదురుగా వచ్చి శ్రీకాంత్ కళ్లలో కారం చల్లాడు.
ఆ తర్వాత, తేరుకునేలోపే వెనుకాల నుంచి వచ్చిన మరో ముగ్గురు దాడి చేసి అతని చేతిలో ఉన్న నగదు బ్యాగును లాక్కొని పరారయ్యారు. రోడ్డుపై పడి ఉన్న శ్రీకాంత్‌ను గమనించిన స్థానికులు ప్రశ్నించగా, జరిగిన విషయాన్ని వారికి చెప్పాడు.

అనంతరం మైలాద్‌దేవ్‌పల్లి పోలీసులకు సమాచారం అందించడంతో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ జావీద్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాటేదన్ పారిశ్రామిక వాడలో ఆదివారం జన సంచారం తక్కువగా ఉండటంతో దుండగులు ఈ దురాగతానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
దర్యాప్తు వేగవంతం కాటేదన్ పారిశ్రామిక వాడలోని క్యాషియర్ వద్ద డబ్బులున్నట్లు దొంగలకు ముందే ఏవిధంగా తెలుసనే విషయాలపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ఒకే యజమానికి సంబంధించిన కంపెనీలు కావడంతో డబ్బులను ఇక్కడ నుంచి అక్కడకు తరలిస్తుంటారని అయితే ఈ విషయం యజమానికి, క్యాషియర్‌కు మాత్రమే తెలిసి ఉంటుందని భావిస్తున్నారు.
అంత డబ్బును రోడ్డుపై ఒకే వ్యక్తి తీసుకువస్తుండగా పక్కాప్లాన్ ప్రకారమే దొంగలు దోపిడీ చేశారా? లేక ఇవన్నీ ముందే తెలుసా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. దొంగతనం జరిగిన సంఘటనా స్థలాన్ని రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి పరిశీలించారు. కేసును తొందరలోనే చేధిస్తామన్నారు.












Click it and Unblock the Notifications