హైదరాబాద్ నగరవాసులకు ముఖ్య గమనిక.. ఈ రూట్లలో మూడురోజులు ట్రాఫిక్ ఆంక్షలు..
హైదరాబాద్ నగర వాసులకు ఓ ముఖ్య గమనిక. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం సందర్భంగా నగరంలో మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు అధికారులు తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనంలో ఉంచుకుని ఇతర ప్రత్యామ్నాయ రూట్లను ఎంచుకోవాలని ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ పి.విశ్వప్రసాద్ పేర్కొన్నారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు నేటి నుంచి బుధవారం (10వతేది) రాత్రి ఎనిమిది గంటల వరకు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.
ఏఏ మార్గాల్లో...
సత్యం థియేటర్ మీదుగా ఫతేనగర్ వెళ్లే వాహనాలను బల్కంపేట మీదుగా అనుమతించడం లేదు. గ్రీన్ ల్యాండ్స్, అమీర్ పేట్ కనకదుర్గా ఆలయం వైపు నుంచి వెళ్లాలనుకునే వారు మాత్రం ఎస్సార్ నగర్ టి - జంక్షన్ నుంచి ఎడమవైపు మలుపు తీసుకుని ఎస్సార్ నగర్ కమ్యూనిటీ కూడలి నుంచి కుడివైపు మలుపు తీసుకుని బీకేగూడ, శ్రీరామ్ నగర్ ఎక్స్ రోడ్డు మీదుగా ఫతేనగర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఫతేనగర్ బ్రిడ్జి మీదుగా అమీర్‌పేట్ వైపు వెళ్లాల్సిన వాహనదారులు బల్కంపేట - బేగంపేట లింకు రోడ్డు మీదుగా తాజ్ వివంతా హోటల్ నుంచి యూటర్న్ తీసుకుని, గ్రీన్ ల్యాండ్స్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. బకుల్ అపార్ట్‌మెంట్స్, గ్రీన్ ల్యాండ్స్, ఫుడ్ వరల్డ్ వైపు నుంచి ధరంకరం రోడ్డు మీదుగా వెళ్లే వాహనాలను నిలిపివేస్తున్నారు.

అటుగా వెళ్లేవారు సోనాబాయి ఆలయం, సత్యం థియేటర్ నుంచి యూటర్న్ తీసుకుని ఎస్సార్ నగర్ టి - జంక్షన్, ఎస్సార్ నగర్ కమ్యూనిటీ హాల్, బీకేగూడ, శ్రీరామ్ నగర్ మీదుగా వెళ్లగలరు. బేగంపేట కట్టమైసమ్మ దేవాలయం నుంచి లింకు రోడ్డు మీదుగా బల్కంపేటకు వెళ్లేవారి వాహనాలను నిలిపివేస్తున్నారు. కాబట్టి అటుగా వెళ్లేవారు ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మీదుగా సోనీ వైన్స్, ఉమేశ్ చంద్ర విగ్రహం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
నాలుగు చోట్ల వాహనాల పార్కింగ్..
రేపు (మంగళవారం) బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం జరగనుంది. ఈ కళ్యాణం కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయం సమీపంలో నాలుగు చోట్ల వాహనాలు పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తులు తమ వాహనాలను ఫతేనగర్ రైల్వే సమీపంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద ఇరువైపులా పార్క్ చేయాలని అధికారులు కోరుతున్నారు. ఈ నెల 10వ తేదిన సాయంత్రం భక్తులతో రథోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం కోసం అన్నీ ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు.












Click it and Unblock the Notifications