Uday Krishna Reddy: "ఆమె భర్తకు అందుకే వీడియోలు పంపా.."
హైదరాబాద్ లోని ప్రతిష్ఠాత్మక సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో వెలుగుచూసిన రచ్చ ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. తోటి మహిళా ఆఫీసర్‌ను లైంగికంగా వేధించారనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి.. కేసు ఊహించని మలుపులు తిరుగుతుంది. తనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రిమినల్ కేసును తక్షణమే రద్దు చేయాలంటూ ఆయన తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ వేయడం గమనార్హం. ఈ సంచలన పిటిషన్‌పై నేడు హైకోర్టులో కీలక విచారణ జరగనుంది.
బాధిత మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆరోపణల ప్రకారం.. ఈ ఏడాది జూన్ 23 నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి తనను తీవ్రస్థాయిలో వేధించడం మొదలుపెట్టాడు. మొబైల్‌కు అభ్యంతరకర సందేశాలు పంపడం, లేనిపోని బంధాలను ఆపాదిస్తూ దుష్ప్రచారం చేయడం వంటి పనులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా తన చేతిలోని ఫోన్‌ను బలవంతంగా లాక్కుని వ్యక్తిగత మెసేజ్‌లు పరిశీలించాడని, రహస్యంగా తీసిన వీడియోలను తన భర్తకు పంపి బెదిరింపులకు దిగాడని ఆమె పోలీసుల ఎదుట వాపోయారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగానే అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

నిందితుడి వర్షన్ వేరు: అదంతా ప్రేమాకథే!
కేసు విచారణలో ఉండగానే ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి. తమ ఇద్దరి మధ్య దాదాపు ఏడాది కాలంగా ప్రేమాయణం సాగుతోందని, పెళ్లి చేసుకోవాలని కూడా భావించామని ఆయన సరికొత్త వాదన వినిపిస్తున్నారు. తాను వేరే మహిళతో తిరుగుతున్నాననే అనుమానంతోనే ఆమె మరొకరిని వివాహం చేసుకుందని, ఆ తర్వాత కూడా తన గదికి వస్తూ చనువుగా ఉండేదని చెబుతున్నారు. ఈ విషయం తెలిసి ఆమె భర్త తనకు ఫోన్ చేసి నిలదీయడంతోనే, తమకు సంబంధించిన వాట్సప్ చాటింగ్‌లు, ఫొటోలు, వీడియోలను ఆయనకు పంపాల్సి వచ్చిందని ఉదయ్ వాదిస్తున్నారు.
అంతర్గత విచారణ ముమ్మరం.. ఐపీఎస్ వర్గాల్లో కలకలం!
పోలీస్ అకాడమీ వంటి అత్యున్నత శిక్షణ కేంద్రంలో ఇద్దరు భావి ఐపీఎస్ అధికారుల మధ్య ఇలాంటి వివాదం చెలరేగడంపై ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ వ్యవహారంపై నిజానిజాలు తేల్చేందుకు అకాడమీ యంత్రాంగం ప్రత్యేకంగా అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా నిందితుడిపై కేంద్ర హోంశాఖ కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది. మరోవైపు, ఈ మానసిక ఒత్తిడి తాళలేక తాను ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డానని, తన ఈ స్థితికి ఆ మహిళతో పాటు మరో నలుగురు కారణమని ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోపించడం ఈ కేసును మరింత సంక్లిష్టంగా మార్చింది.


Click it and Unblock the Notifications