యువకుడి కడుపులో తన్నిన టిఆర్ఎస్ లీడర్?: కేటీఆర్ వివరణ(వీడియో)
ఓ కన్సల్టెన్సీ సంస్థను నిర్వహిస్తున్న సంతోష్.. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
హైదరాబాద్/సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో అధికార టిఆర్ఎస్ పార్టీకి చెందిన నేతగా చెప్పుకుంటున్న ఈదలూరి సంతోష్ అనే వ్యక్తి ఇద్దరు యువకులను తీవ్రంగా కొట్టాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అతనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
కాగా, ఓ కన్సల్టెన్సీ సంస్థను నిర్వహిస్తున్న సంతోష్.. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అంతేగాక, తనకు మంత్రులతో సంబంధాలున్నాయంటూ నిరుద్యోగులను నమ్మించేవాడని సమాచారం.
అతని మాటలు నమ్మి, చివరకు మోసపోయామని తెలుసుకుని సదరు నేతను నిలదీసిన బాధితులపై బెదిరింపులకు పాల్పడటంతోపాటు దాడులు కూడా చేస్తున్నట్లు సమాచారం.

తాజాగా, అతడ్ని నిలదీసిన ఇద్దరు యువకులను గదిలో బంధించి బెదిరింపులకు గురిచేయడంతోపాటు దాడి చేశాడు. తమను విడిచిపెట్టాలంటూ ఇద్దరు యువకులు కాళ్లు పట్టుకుని వేడుకున్నా.. అతడు కనికరం చూపలేదు. బూతులు తిట్టుకుంటూ ఒక్కసారిగా లేచిన సంతోష్.. ఓ యువకుడి కడుపులో గట్టిగా తన్నడంతో అతడు కుప్పకూలిపోయాడు.
కాగా, ఇద్దరు యువకులను తీవ్రంగా కొట్టిన దృశ్యాలు ఎవరో వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో.. సంతోష్ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై నెటిజన్లు దాడికి పాల్పడిన సంతోష్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. అతడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
కేసు నమోదు
సదరు ఇద్దరు బాధిత యువకులు హుస్సేన్, అఖిల్ తమను మోసం చేశారని సంతోష్‌పై ఫిర్యాదు చేయడంతో సూర్యాపేట పోలీసులు అతని కేసు నమోదు చేశారు. ఉద్యోగం ఇస్తానని భారీగా డబ్బులు తీసుకున్నాడని, కానీ ఉద్యోగం ఇప్పించలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ డబ్బును తిరిగివ్వాలని కోరితే.. సంతోష్ తమపై దాడి చేశారని బాధిత యువకులు చెప్పారు.
టిఆర్ఎస్ సభ్యుడు కాదు: కేటీఆర్ స్పష్టం
సదరు యువకులపై దాడికి పాల్పడిన సంతోష్ అనే వ్యక్తి టిఆర్ఎస్ పార్టీ సభ్యుడు కాదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కూడా ధృవీకరించారని అన్నారు. యువకులపై దాడికి పాల్పడిన ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications