ఫీల్డ్ స్టోరీ: రెండున్నరేళ్లలోనే తెరాస ఎమ్మెల్యేల ఎదురీత, ఎందుకిలా?

వరంగల్: మంత్రివర్గంలో ఇద్దరికి చోటు.. మరొకరికి కీలక పదవి.. నియమిత పదవుల్లోనూ ఇక్కడి నేతలకే ప్రాధాన్యం.. ఇక జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా వరాలు ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి.. ఆకట్టుకునే సంక్షేమ పథకాలు.. వీటన్నింటి కంటే.. తెరాస, తెలంగాణ ఉద్యమం ఒడిదొడుకుల్లో ఉన్నప్పుడల్లా వెన్నంటి నిలిచిన జనం.. పార్టీకి, ఉద్యమానికి కంచుకోటగా మారిన జిల్లాలో అధికారపక్ష శాసనసభ్యులకు ఎదురుగాలి వీస్తుండడం తెరాస శ్రేణుల్లో చర్చకు దారితీసింది. తెరాస సర్కారు పనితీరుపై సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ ఇటీవల నిర్వహించిన సర్వేలో సీఎం పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రజలు.. కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర వ్యతిరేకత వెలిబుచ్చారు.

ఈ సర్వే వివరాలు అవిభక్త వరంగల్‌ జిల్లాలో కలకలం రేపాయి. అధికార పక్షానికి చెందిన 11 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని సర్వేలో పేర్కొనగా అందులో నాలుగు నియోజకవర్గాలు అవిభక్త వరంగల్‌ పరిధిలోనివే కావడం పార్టీ కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్న నేపథ్యంలో వరంగల్‌ తూర్పు, వర్ధన్నపేట, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌లో వ్యతిరేకత గూడు కట్టుకుంటోందన్న సమాచారం ఆందోళన కలిగించింది. దీనిపై కీలక నేతలు తమ సన్నిహితుల వద్ద ఆరా తీస్తున్నారు. ఇంత త్వరగా పరిస్థితి ఎందుకు మారిందని విశ్లేషిస్తున్నారు.

ఉద్యమానికి వేదికైన జిల్లాలోనే: వరంగల్‌ జిల్లా అంటేనే తెలంగాణ ఉద్యమానికి చిరునామ. తెరాస ఆవిర్భావానికి ముందు నుంచి ఉద్యమ ప్రస్థానానికి ఓరుగల్లు కేంద్ర బిందువు. 1996లోనే హన్మకొండ జెఎన్‌ఎస్‌ మైదానం వేదికగా ప్రజా సంఘాలు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టి భారీ బహిరంగ సభతో ఉద్యమ తీవ్రతను కళ్లకు కట్టాయి.

తెరాస ఆవిర్భావం తర్వాత కరీంనగర్‌లో తొలిసభ నిర్వహించిన కేసీఆర్‌ మలిసభగా వరంగల్‌నే ఎంచుకున్నారు. 2003 ఏప్రిల్‌లో హన్మకొండ ప్రకాశ్‌రెడ్డిపేట వేదికగా నిర్వహించిన తెరాస ఆవిర్భావ బహిరంగ సభకు 10 లక్షల మంది తరలిరావడం రాజకీయ పక్షాల్లో చర్చకు దారితీసింది. 2010లో ఇదే ప్రకాశ్‌రెడ్డిపేటలో నిర్వహించిన సభకు 25 లక్షల మంది తరలిరావడం తెరాస ప్రస్థానంలోనే మర్చిపోలేనిది. ఇలాంటి జిల్లాలో.. అదీ ఎన్నికలు జరిగిన రెండున్నరేళ్లకే నాలుగు నియోజకవర్గాల్లో ఎదురుగాలి వీయడం పార్టీని కలవరపెడుతోంది.

2014లో: సాధారణ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని 12 శాసనసభా స్థానాలకు గాను తెరాస తొమ్మిదింట గెలిచింది. పాలకుర్తి, పరకాలను తెదేపా చేజిక్కించుకోగా.. నర్సంపేటలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. పాలకుర్తి, పరకాల శాసనసభ్యులు తర్వాత తెరాసలో చేరడంతో అధికారపక్ష బలం 11కు చేరింది. నాటి ఎన్నికల్లో తెరాస వరంగల్‌ జిల్లాలో ఏకంగా 68.7 శాతం ఓట్లు సాధించింది.

TRS MLAs in Warangal district face opposition

ఆ తర్వాత 2015లో వరంగల్‌ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పసునూరి దయాకర్‌ ఎంపీగా రికార్డు మెజారిటీ సాధించారు. అనంతరం జరిగిన వరంగల్‌ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లోనూ తెరాసే మెజారిటీ స్థానాలు దక్కించుకుంది. ఇతర పార్టీల నుంచి పలువురు సీనియర్‌ నేతలు, ప్రజాప్రతినిధులు తెరాసలో చేరారు అయినా పరిస్థితి మారడంపై అధిష్ఠానం విశ్లేషిస్తోంది. ఈ నాలుగు నియోజకవర్గాలతో పాటు మహబూబాబాద్‌లోనూ పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని భావిస్తోంది.

ఏం జరుగుతోంది?

తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నాలుగు నియోజకవర్గాల్లో పరిస్థితిని విశ్లేషించడంతోపాటు పార్టీ కార్యకర్తలు, సీనియర్‌ నేతలను కదిలించగా అత్యధికులు వ్యక్తం చేసిన అభిప్రాయాలివి..

వర్ధన్నపేట

* అరూరి రమేశ్‌ 2014 ఎన్నికల్లో 87వేల భారీ ఆధిక్యంతో ఎమ్మెల్యేగా వర్ధన్నపేట నుంచి గెలిచారు. ఈ నియోజకవర్గంతో రమేశ్‌కు అంతగా రాజకీయ పరిచయాలు లేకపోయినా ఉద్యమ హోరు ఉండడం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా తెరాసను అంతటా ఆదరించినట్లే వర్ధన్నపేటలోనూ ఆదరించడంతో రికార్డు మెజారిటీతో విజయం దక్కింది.

* యువకుడు, అందరితో కలివిడిగా ఉండడం, తరచూ గ్రామాలను సందర్శించడంతో నియోజకవర్గ ప్రజలు ఆశలు పెంచుకున్నారు.

* అభివృద్ధి పనులు ముందుకు సాగకపోవడం.. గ్రామాల అభివృద్ధికి భారీ ప్రచారంతో నిర్వహించిన సమీక్ష సమావేశాలు ఫలితం ఇవ్వకపోవడం అసంతృప్తికి బీజం వేశాయి.

* నేతల దృష్టికి సమస్యలు తీసుకెళ్లినా పనులు కావనే ప్రచారం పెరిగింది. ఉదాహరణకు హసన్‌పర్తి మండలంలోని దేవన్నపేట గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొంది. పలుమార్లు సమస్యను తెలిపినా చర్యలు లేవని స్థానికులు తెలిపారు.

* హన్మకొండ, హసన్‌పర్తి మండలాల్లో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే వాటిలో సిబ్బంది నియామకాన్ని పట్టించుకోలేదనే విమర్శలున్నాయి.

* ఆది నుంచి తెరాసలో పనిచేసినవారు, ఉద్యమంలో చురుకుగా వ్యవహరించినవారు తమకు గుర్తింపు ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

జనగామ

* జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండరనేది ప్రధాన ఆరోపణ.
* గోదావరి జలాలతో గ్రామాల్లో చెరువులు నింపే సత్కార్యానికి శ్రీకారం చుట్టినపుడు రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజల్లో హర్షం వ్యక్తమయింది. ఇరిగేషన్‌ శాఖ ద్వారా పనులు జరిగే అవకాశం లేకపోవడంతో, ఒక చెరువు నుంచి మరో చెరువుకు కాలువలు తవ్వించేందుకు అయ్యే ఖర్చంతా గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులు భరించినా తమ చెరువులు నింపారని ముత్తిరెడ్డిని రైతులు అభినందించారు.

* ఎమ్మెల్యే పేరు చెప్పి కొందరు అనుచరులు వ్యవహరిస్తున్న తీరుపై అసంతృపి ఉంది.

* పట్టణానికి తాగునీరు సరఫరా చేసేందుకు చీటకోడూరు రిజర్వాయర్‌ క్లీనింగ్‌ పనుల పేరిట మున్సిపల్‌ నిధులను పెద్ద ఎత్తున వినియోగించేలా ఒత్తిడి తేవడం విమర్శలకు గురి చేసింది. ఉద్దేశం మంచిదే అయినా, నిబంధనలను పట్టించుకోరని ఉద్యోగుల నుంచి విమర్శలు ఎదుర్కొవలసి వచ్చింది.

* ఎస్‌.ఐ.లు, ఉద్యోగుల బదిలీల్లో ఎమ్మెల్యే అనుచరులు కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.

* జనగామను జిల్లాగా చేయాలని ప్రజలు, యువత స్వచ్ఛందంగా ఉద్యమిస్తున్న సమయంలో ఎమ్మెల్యే చాలా రోజుల పాటు అందుబాటులో లేకపోవడం తీవ్ర ఆగ్రహానికి కారణమయింది. అన్ని వనరులు, ఆదాయం కలిగిన చేర్యాల, మద్దూరు మండలాలు పక్క జిల్లాకు వెళ్లిపోతుంటే అడ్డుకోలేదనే భావన ఉంది.
జనగామ స్టేషన్‌ ఘన్‌పూర్‌

* 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొన్ని నెలల పాటు గ్రామాలను సందర్శించకపోవడంతో తమను పట్టించుకోలేదనే భావన పెరిగింది. ఇప్పటికీ నమిలిగొండ, విశ్వనాథపురంవంటి గ్రామాల్లో పర్యటించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

* ఆది నుంచి తెరాసలో ఉన్నవారిని, ఉద్యమంలో పాల్గొన్నవారికి గుర్తింపు లేదనే అసంతృప్తి ఉంది.

* ఎమ్మెల్యేకు సన్నిహితంగా మెలిగే ఇద్దరు నేతలే స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలో చక్రం తిప్పుతున్నారని కార్యకర్తలు తెలిపారు.

* స్టేషన్‌ ఘన్‌పూర్‌ను వరంగల్‌లో కాకుండా జనగామలో చేర్చడాన్ని ప్రతిఘటించకపోవడం కూడా అసంతృప్తికి కారణమయింది.

వరంగల్‌ తూర్పు

* 2014 ఎన్నికల్లో స్థానికులు కాకపోయినప్పటికి వరంగల్‌ తూర్పు నియోజకవర్గ ప్రజలు కొండా సురేఖను ఆదరించారు. వరుసగా మూడుసార్లు విజయం సాధించిన బస్వరాజు సారయ్యను కాదని భారీ మెజారిటీతో గెలిపించారు.

* సమస్యలను తెలిపేందుకు ఎమ్మెల్యేను కలవడమే అసలు సమస్యలా మారిందని నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. కొందరు చోటా నేతలను ప్రసన్నం చేసుకుంటేనే ఎమ్మెల్యేను కలిసే అవకాశం లభిస్తుంది.

* 'త్వరలోనే నియోజకవర్గ పరిధిలో ఇల్లు తీసుకుంటాను. ప్రజలకు అందుబాటులో ఉంటానని' ఎన్నికల ముందు పేర్కొన్న ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఆ దిశగా చర్య తీసుకోలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే హన్మకొండ ప్రాంతం రాంనగర్‌లో ఉంటున్నారు. ఖిలావరంగల్‌, రంగశాయిపేట, ఉర్సు, కరీమాబాద్‌, శివనగర్‌, లేబర్‌కాలనీ, దేశాయిపేట తదితర కాలనీల ప్రజలు అక్కడికి వెళ్లాలంటే ఇబ్బంది పడాల్సిందే.

* చోటా నేతలు చెప్పిందే వేదం. డివిజన్ల అభివృద్ధి, నిధుల కేటాయింపు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలన్నీ కోటరీ నాయకుల కను సన్నల్లోనే జరుగుతున్నాయి.

* ఎమ్మెల్యే కాలనీలను సందర్శించినప్పుడు పోలీసుల హడావుడి కూడా ఎక్కువే. రెండు, మూడు వాహనాల్లో తిరుగుతూ సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన ఘటనలున్నాయి.

* చేసిన అభివృద్ధిపై ప్రచారమూ లేకపోవడం ఇక్కడ లోపంగా మారింది. గ్రేటర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ముందు వరంగల్‌ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్స్‌ ద్వారా సుమారు రూ.80కోట్లు కేటాయించింది. సీఆర్సీ భవనాలు, గురుకులాలు, షాదిఖానాకు ప్రత్యేకంగా నిధులు వచ్చాయి. వీటిపై కార్యకర్తలకూ కనీస సమాచారం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+