కేసీఆర్ దేవుడే కానీ..: స్వీయ గృహనిర్బంధంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు
Recommended Video

చెన్నూరు: తనకు టికెట్ కేటాయించలేదని మనస్తాపంతో మంచిర్యాల చెన్నూరు తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు మంగళవారం స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు. ఇటీవల టీఆర్ఎస్ ప్రకటించిన 105మంది అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మందమర్రి మూడో జోన్‌లోని తన నివాసంలో గృహ నిర్బంధంలో ఉన్నారు. ఆయనతోపాటు భార్య భాగ్యలక్ష్మి, కుమారుడు సందీప్, కుమార్తె జ్యోత్స్న, తల్లి పోచవ్వ కూడా ఇంట్లోనే ఉన్నారు. తనకు టికెట్ కేటాయింపుపై స్పష్టమైన హామీ ఇస్తే గానీ, తాను గృహ నిర్బంధం నుంచి బయటకు రానని ఆయన తేల్చి చెప్పారు.

కాగా, స్థానిక నేతలు, కార్యకర్తలు నల్లాల ఓదేలుకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాను 2009 నుంచి ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని నల్లాల ఓదేలు చెప్పారు. తాజా జాబితాలో సిట్టింగులు అందరికీ టికెట్ ఇచ్చి.. తనకు మాత్రమే ఇవ్వకపోవడం బాధించిందని అన్నారు.

తనకు కేసీఆర్ ఇప్పటికీ దేవుడేనని నల్లాల ఓదేలు అన్నారు. బాల్క సుమన్ వల్లే తనకు టికెట్ రాలేదని ఆయన ఆరోపించారు. తనకు టికెట్ ఇచ్చేంత వరకు తన నిరసన కొనసాగిస్తానని ఓదేలు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications