తెలంగాణలో కరోనా: కొత్తగా 494 కేసులు, 3మరణాలు -రికవరీ రేటు 98.16శాతం -యాక్టివ్ కేసులు 8,112
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం స్థిరంగా కొనసాగుతున్నది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో మొత్తం 89,037 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 494 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 6,50,353కు పెరిగింది.
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 80 కేసులు రాగా, కరీంనగర్ జిల్లాలో 51, వరంగల్ అర్బన్ జిల్లాలో 45 కేసులు వచ్చాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో 5 కొత్త కేసులు, భద్రాద్రి కొత్తగూడెం 14, జగిత్యాల 21, జనగామ 6, జయశంకర్ భూపాలపల్లి 3, జోగులాంబ గద్వాల 3, కామారెడ్డి 5, ఖమ్మం 29, కొమరంభీం ఆసిఫాబాద్ 2, మహబూబ్ నగర్ 4, మహబూబాబాద్ 6, మంచిర్యాల 12, మెదక్ 4, మేడ్చల్ మల్కాజ్ గిరి 26, ములుగు 5, నాగర్ కర్నూలు 2, నల్గొండ 33, నారాయణపేట్ లో 0, నిర్మల్ 2, నిజామాబాద్ 7, పెద్దపల్లి 28, రాజన్న సిరిసిల్ల 14, రంగారెడ్డి 23, సంగారెడ్డి 5, సిద్దిపేట 13, సూర్యాపేట 18, వికారాబాద్ 3, వనపర్తి 2, వరంగల్ రూరల్ జిల్లాలో 13, యాదాద్రి భువనగిరి జిల్లాలో 10 కొత్త కేసులు నమోదయ్యాయి.

నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 621 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. తద్వారా మొత్తం రికవరీల సంఖ్య 6,38,410కి, మొత్తం మరణాల సంఖ్య 3,831కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 8,112గా ఉంది. దేశంలో మరణాల రేటు 1.3శాతంకాగా, తెలంగాణలో అది 0.58 శాతంగా ఉందని, జాతీయ స్థాయిలో రికవరీ రేటు 97.4శాతం కాగా, తెలంగాణలో అది 98.16 శాతంగా ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
కరోనా థర్డ్ వేవ్ ఆగస్టులో వస్తుందని పరిశోధకులు అంచనా వెయ్యడంతో అలెర్టయిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో థర్డ్ వేవ్ వచ్చే ఛాన్స్ ఉందా అనే అంశంపై ఫోకస్ పెట్టింది. థర్డ్ వేవ్‌కి కారణమయ్యే మ్యూటేషన్లు, వేరియంట్లు తెలంగాణలో పుట్టాయా అనే దానిపై మరికొన్ని రోజుల్లో సీరో సర్వే చేయనుంది. మూడు నెలల కిందట తెలంగాణలో డెల్టా ప్లస్ వేరియంట్ కనిపించింది. దాని ప్రభావం అంతగా లేదు. మరి అది ఇప్పుడు ఉందా లేదా అనే అంశంపైనా ప్రభుత్వం స్పష్టత కోరుకుంటోంది. ఈ సీరో సర్వే ద్వారా... ప్రజల్లో ఎంత మందికి యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయో తెలుస్తుంది. సీరో సర్వే రిపోర్టును బట్టీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కామారెడ్డి, జనగామ, నల్గొండ జిల్లాలో జరిపిన సీరో సర్వేలో... 60 శాతం మందికి యాంటీబాడీలు ఉన్నట్లు తేలింది. కాగా,
తెలంగాణ మాదిరిగానే పొరుగు రాష్ట్రమైన ఏపీలోనూ కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 1,461 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 235 కేసులు నమోదు కాగా కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 12 కేసులు నమోదయ్యాయి. ఏపీలో నిన్న ఒక్కరోజే 2,113 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది మహమ్మారి కారణంగా మృతి చెందారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,85,182కి చేరుకోగా 19,52,736 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 13,564 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,882 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక,
దేశం మొత్తంగా చూసుకుంటే, కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 28,204 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం నాటి బులిటెన్ లో పేర్కొంది. 147 రోజుల తర్వాత రోజువారీ కేసులు భారీగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 3,88,508 ఉన్నాయని.. 139 రోజుల తర్వాత కనిష్ఠానికి చేరుకున్నాయని తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.21శాతం ఉన్నాయని చెప్పింది. రికవరీ రేటు 97.45శాతానికి పెరిగిందని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 41,511 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు.
తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,19,98,158కు పెరిగింది. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 3,11,80,968 మంది బాధితులు కోలుకున్నారు. మరో 373 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 4,28,682కు పెరిగింది. మరో వైపు దేశంలో టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 51,45,00,268 డోసులు పంపిణీ చేసినట్లు మంత్రిత్వ శాఖ చెప్పింది. వీక్లీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 2.36 శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.87 తగ్గిందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 48.32 కోట్ల కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది. దేశంలో..
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. కేంద్రం సహకారంతో భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ది చేసిన కొవాగ్జిన టీకాల ఉత్పత్తిని పెంచే దిశగా మరిన్ని ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని అంకలేశ్వర్‌లో కోవాగ్జిన్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపినట్లు ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తెలిపారు. ఇప్పటిదాకా కేవలం హైదరాబాద్ యూనిట్ నుంచి మాత్రమే కోవాగ్జిన్ ఉత్పత్తి జరిగేది. ఇక నుంచి అంకలేశ్వర్ యూనిట్ నుంచి కూడా ఉత్పత్తి ప్రారంభించనున్నది.












Click it and Unblock the Notifications