Keep it up: హోంగార్డు అష్రఫ్ అలీని సంత్కరించిన తెలంగాణ హైకోర్టు సీజే సతీష్‌చంద్ర శర్మ: ఎందుకంటే..?
హైదరాబాద్: అంకిత భావంతో తన విధులు నిర్వహిస్తున్న హోంగార్డు అష్రఫ్ అలీని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ అభినందించారు. హోంగార్డుకు పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు. తనకు ఊహించని వ్యక్తి నుంచి అభినందనలు రావడంతో సదరు హోంగార్డు ఆనందం వ్యక్తం చేశారు.

మూడు నెలలుగా గమనిస్తున్న హైకోర్టు సీజే
వివరాల్లోకి వెళితే.. అష్రఫ్ అలీ అనే హోంగార్డు అబిడ్స్ ట్రాఫిక్ విభాగంలో హోంగార్డుగా పనిచేస్తున్నారు. బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం కూడలి వద్ద ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ అదే మార్గంలో హైకోర్టు సీజే సతీశ్ చంద్ర శర్మ రాకపోకలు సాగిస్తుంటారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న అష్రఫ్ అలీని గత మూడు నెలలుగా గమనిస్తున్నారు.

హోంగార్డుకు పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించిన హైకోర్టు సీజే
హోంగార్డు అంకితభావంతో విధులను నిర్వహిస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం సీజేను ఆకట్టుకుంది. దీంతో శుక్రవారం అదే మార్గంలో వెళ్తూ హోంగార్డు అష్రఫ్ అలీని చూసి ఆయన వాహనాన్ని ఆపారు. అనంతరం హోంగార్డు అష్రఫ్ అలీకి పుష్పగుచ్ఛం ఇచ్చి, అతడి సేవలను అభినందించారు. అక్కడున్నవారంతా ఈ దృశ్యాన్ని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో సదరు హోంగార్డుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఉన్నతాధికారులు కూడా హోంగార్డు పనితీరును అభినందిస్తున్నారు.

కీప్ ఇట్ అప్ అన్నారంటూ సీజే అభినందనలపై హోంగార్డు అష్రఫ్ అలీ
కాగా, ఏకంగా హైకోర్టు సీజే వచ్చి తనను అభినందించడం చాలా గర్వంగా ఉందని హోంగార్డు అష్రఫ్ అలీ ఆనందం వ్యక్తం చేశారు. మరింత ఉత్సాహంగా తన విధులు నిర్వర్తిస్తానని తెలిపారు. తాను గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోనే విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మార్గం గుండానే హైకోర్టు సీజే వెళ్తుండేవారని చెప్పారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనను అభినందించడం ఆనందంగా ఉందని, కీప్ ఇట్ అప్ అంటూ తనను ప్రోత్సహించారని అష్రఫ్ అలీ తెలిపారు.
హైకోర్టు సీజేకు ధన్యవాదాలు తెలిపిన సీపీ సీవీ ఆనంద్
'నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు అష్రఫ్ అలీని అభినందించినందుకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. హెచ్‌సిపి, హెచ్‌టిపికి ఇది అరుదైన గుర్తింపు, గౌరవం. అష్రఫ్ అలీ పని పట్ల ఆదర్శప్రాయమైన అంకితభావాన్ని ప్రదర్శించారు. అతనికి వందనాలు' అని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.












Click it and Unblock the Notifications