TSPSC అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షల కొత్త తేదీలు వచ్చేశాయ్..: షెడ్యూల్ ఇదే
హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఉదంతం.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం. రాజకీయంగా పెను దుమారానికి దారి తీసిందీ ఘటన. వేలాదిమంది నిరుద్యోగులను నిరాశలో ముంచెత్తింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కారణంగా పరీక్షలు కూడా రద్దయ్యాయి. ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారణ కొనసాగిస్తోన్నారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ సహా ఈ కేసులో ప్రమేయం ఉందని భావిస్తోన్న పలువురిని అరెస్ట్ చేశారు.
ఈ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు 15 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో వందకు వంద 100 మార్కులు సాధించిన.. 20 మంది అభ్యర్థుల నుంచి కూడా సిట్ అధికారులు వివరాలను రాబట్టుకున్నారు. అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రాలను లీకేజీ కేసులో నిందితులు డాక్యానాయక్‌ను కీలక విషయాలను సేకరించారు. వారి నుంచి ఎవరెవరికి పేపర్లు వెళ్లాయనే విషయంపై ఆరా తీస్తోన్నారు.

ఈ వ్యవహారం అటు రాజకీయంగా పెను దుమారానికి దారి తీసింది. అధికార భారత్ రాష్ట్ర సమితిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు రాజకీయ ప్రత్యర్థులు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వేర్వేరుగా ఆందోళనలను చేపట్టాయి. నిరసన ప్రదర్శనలను నిర్వహించాయి. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల వేలాది మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించడం కూడా ప్రభుత్వానికి చేతకావట్లేదంటూ మండిపడ్డాయి.
ఈ పరిణామాల మధ్య తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పరీక్షల కొత్త షెడ్యూల్‌ను ప్రకటించారు. పరీక్షల తేదీలను వెల్లడించారు. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఓ ప్రకటన విడుదల చేశారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పరీక్షల్లో భాగంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ను మే 8వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు.

అగ్రికల్చర్, మెకానికల్ ఇంజినీరింగ్ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ను మే 9వ తేదీ షెడ్యూల్ చేశారు. సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ఓఎంఆర్ బేస్డ్ పరీక్షను మే 21వ తేదీన నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి తెలిపారు. పరీక్షా తేదీకి ఒక వారం రోజుల ముందు అభ్యర్థులు తమ హాల్ టికెట్లను వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని వివరించారు. ఈ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేలా పకడ్బందీ చర్యలను తీసుకున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications