మరో షాకిచ్చిన టీఎస్ఆర్టీసీ: ఈసారి రూట్ బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది
హైదరాబాద్: ఇప్పటికే మూడు సార్లు ఛార్జీలు పెంచిన టీఎస్ఆర్టీసీ మరో షాకిచ్చింది. తాజాగా, రూట్ బస్‌పాస్ ఛార్జీలను కూడా పెంచింది. 4 కిలోమీటర్ల దూరానికి బస్‌పాస్ ఛార్జీ రూ. 165 నుంచి రూ. 450కి, 8 కిలోమీటర్ల దూరానికి రూ. 200ల నుంచి రూ. 600కు, 12 కిలోమీటర్ల దూరానికి రూ. 245 నుంచి రూ. 900లకు పెంచింది.
అంతేగాక, 18 కిలోమీటర్ల దూరానికి రూ. 280 నుంచి రూ. 1150కు, 22 కిలోమీటర్ల దూరానికి రూ. 330 నుంచి రూ. 1350కి పెంచింది. తాజా పెంపుతో విద్యార్థులపై భారీగానే భారం పడనుంది. ఇప్పటికే ప్రజలపై భారం మోపిన ఆర్టీసీ ఇప్పుడు విద్యార్థులపైనా భారం వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికే పలుమార్లు ఛార్జీలు పెంచిన ఆర్టీసీ
తెలంగాణ ప్రజలకు మరోసారి టీఎస్ఆర్టీసీ షాకిచ్చింది. ఇప్పటికే రెండుసార్లు ఛార్జీలు పెంచి టీఎస్ఆర్టీసీ మరోసారి ప్రజలపై భారం మోపింది. కిలోమీటర్ వారీగా డీజిల్ సెస్ విధిస్తోంది. డీజిల్ సెస్ భారం వల్ల ఛార్జీలు పెంచింది.
అయితే, ఛార్జీల పెంపు నుంచి జీహెచ్‌ఎంసీని మినహాయించింది.తక్కువ దూరం ప్రయాణికులపై భారం పడకుండా స్లాబ్‌లు తీసుకొచ్చింది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో డీజిల్ సెస్ కనీసం రూ.5గా నిర్ణయించింది. 250 కిలోమీటర్ల దూరం వరకు పల్లె వెలుగులో రూ.45, ఎక్స్‌ప్రెస్‌లో 500 కిలోమీటర్ల వరకు రూ.90, డీలక్స్ బస్సుల్లో 500 కిలోమీటర్ల దూరానికి రూ.125 డీజిల్ సెస్ వసూలు చేస్తున్నారు.
ఇక, సూపర్ లగ్జరీ బస్సుల్లో కనీస దూరానికి రూ.10లు, 500 కిలోమీటర్ల వరకు రూ.130 డీజిల్ సెస్ రూపంలో వసూలు చేస్తున్నారు. ఏసీ సర్వీసుల్లో కనీస దూరానికి రూ.10, 500 కిలోమీటర్ల వరకు రూ.170 డీజిల్ సెస్ రూపంలో వసూలు చేస్తున్నారు. కనిష్ఠ, గరిష్ఠ దూరాన్ని బట్టి టికెట్లపై ఆర్టీసీ డీజిల్ సెస్ వసూలు చేస్తోంది.
ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన డీజిల్ సెస్ జూన్ 9 నుంచే అమల్లోకి తీసుకొచ్చారు. గతంలో రౌండప్, టోల్ ప్లాజాలు, ప్యాసింజర్స్ సెస్ పేరిట ఒకసారి ఛార్జీలు పెంచిన ఆర్టీసీ మరోసారి ఏప్రిల్‌లో డీజిల్ సెస్ పేరుతో ప్రయాణికులపై భారం మోపిన విషయం తెలిసిందే. అంతేగాక, గతంలో పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులలో ఒక్కో ప్రయాణికుడి నుంచి డీజిల్ సెస్ కింద 2 రూపాయలు, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, ఏసీ సర్వీసులలో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.5 చొప్పున పెంచింది. తాజాగా, పెంపుతో ప్రజలపై మరింత భారం పడనుంది. ఇప్పటికే అన్ని ధరలు పెరిగి సతమతమవుతున్న సామాన్యులపై ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ మరింత భారం మోపిందని ప్రజలు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications