ఇదే మంచి తరుణం: తెలంగాణ నేతలకు స్వీట్ తినిపించిన చంద్రబాబు(ఫొటోలు)
హైదరాబాద్: తెలంగాణ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఉపయోగించుకోవాలని తెలంగాణ తెలుగుదేశం నేతలకు ఆ పార్టీ అధినేత, ఏపి సిఎం చంద్రబాబునాయుడు సూచించారు. తెలంగాణ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసిన సందర్భంగా శుక్రవారం విజయవాడలో తెలంగాణ టిడిపి నేతలు కలిశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రజలు అనేక అంశాల కారణంగా టిఆర్ఎస్‌ను గెలిపించారు. ఏడాదిన్నరకే వారి ఆశలు సన్నగిల్లుతున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాపిస్తోంది. ఇదే మంచి తరుణం. దీన్ని అందిపుచ్చుకోండి. ప్రతిసమస్యపైనా పోరాటం చేయండి. ప్రత్యామ్నాయం టిడిపియేనని విశ్వాసం కలిగిస్తే చాలు' అని సూచించారు.

పదేళ్లు పాలించిన కాంగ్రెస్ ఏమీ చేయలేదని, ఆ పార్టీపై ప్రజల్లో విముఖత ఉందని అన్నారు. హైదరాబాద్ సహా తెలంగాణలో అభివృద్ధి చేసి చూపిన ఘనత, మంచి పాలన ఇచ్చిన పేరూ టిడిపికే ఉందని చెప్పారు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

చంద్రబాబుతో భేటీయైన వారిలో టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ, తెలుగురైతు అధ్యక్షుడు వంటేరు ప్రతాప్ రెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు టి వీరేందర్, నేతలు మల్లయ్య యాదవ్, బెల్యానాయక్, టిఎన్ఎస్ఎఫ్ నేత శరత్ చంద్ర తదితరులు ఉన్నారు. రెండ్రోజులుగా అసెంబ్లీలో విపక్షాలు చేస్తున్న పోరాటానికి ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని నేతలు బాబుకు వివరించారు.












Click it and Unblock the Notifications