మందు బాబులకు అలర్ట్: ఆ రెండు రోజులు వైన్ షాపులు బంద్, ఎందుకంటే?
హైదరాబాద్: మందు బాబులకు ముఖ్య గమనిక. ఈ వారంతంలో మందుబాబులకు మందు దొరక్క పోవచ్చు. ఎందుకంటే ఆషాఢమాసం ఆఖరి వారం లాల్ దర్వాజ బోనాల సందర్భంగా జులై 16, 17వ తేదీల్లో వైన్స్ షాపులు బంద్ చేయనున్నారు. బోనాలు ముగిసే వారం కావడంతో వేలాది మంది భక్తులు లాల్ దర్వాజలోని 'సింహవాహిని మహంకాలి' అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.
ఈ ఆదివారం బోనాల పండగ పరిసమాప్తం కానుంది. హైదరాబాద్ కమిసనరేట్ పరిధిలో సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి జోన్, ఎల్బీనగర్ జోన్(వనస్థలిపురం డివిజన్), మహేశ్వరం జోన్ పరిధిలో రెండు రోజులు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆయా కమిషనర్లు ఆదేశించారు.

ఎల్బీనగర్ డివిజన్ పరిధిలో 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు రెండు రోజులపాటు మద్యం దుకాణాలు మూసివేయాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా హైదరాబాద్ నగరంలో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
వచ్చే ఆదివారం బోనాల పండగ సందర్భంగా 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్ల పరిధిలో, సౌత్ జోన్ పరిధిలో 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు రెండు రోజులపాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఉత్తర్వులు స్పష్టం చేశారు. దీంతో ఈ రెండు రోజులపాటు మందుబాబులకు నగరంలో మద్యం లభించే అవకాశం లేదు. మరోవైపు, సోమవారం తెలంగాణ ప్రభుత్వం సాధారణ సెలవు దినంగా ప్రకటించింది.
కాగా, హైదరాబాద్ నగరంలో బోనాల పండగ ఎంతో వైభవంగా జరుగుతుంది. గోల్కొండలో అమ్మవారికి తొలి బోనాలు సమర్పించడంతో ప్రారంభమైన ఈ పండగ నెల రోజులపాటు కొనసాగుతోంది. పెద్ద ఎత్తున మహిళలు బోనాలు సమర్పించి అమ్మవారిని ఆరాధిస్తారు. ప్రముఖ ఆలయంలో ఇటీవల బోనాల ఉత్సవాలు జరిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications