ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు మృతి, భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో శిశువు మాయం
హైదరాబాద్: వరంగల్ జిల్లా జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఎన్ కౌంటర్ జరిగింది. ప్రత్యేక పోలీసు బలగాలు, మావోయిస్టులు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ అబర్ కిషోర్ ఝా ధ్రువీకరించారు .
మృతి చెందిన మావోయిస్టులు కేకేడబ్ల్యు సభ్యులుగా గుర్తించారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. తప్పించుకున్న మిగతా మావోయిస్టుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఛత్తీస్‌గడ్ నుంచి 10 రోజుల క్రితం వరంగల్ జిల్లాకు మావోయిస్టులు చేరుకున్నట్లు సమాచారం.
సుమారు 15 నిమిషాల పాటు పోలీసులు, మావోయిస్టులు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో మహిళా మావోయిస్టు కూడా మృతి చెందినట్లు సమాచారం. ఘటనా స్థలంలో 2 ఆయుధాలు, కిట్ బ్యాగ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో మావోల కార్యకలాపాలు పెరిగాయి. ఓ ప్రొక్లెయినర్ ను తగులబెట్టిన మావోలు, కొందరికి హెచ్చరికలు పంపుతూ కరపత్రాలను కూడా పంచారు. ఈ నేపథ్యంలో గ్రేహాండ్స్ దళాలకు కూంబింగ్‌కు వెళ్లారు. లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినా మావోలు వినలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఎదురుకాల్పులు చేయాల్సి వచ్చిందన్నారు.
భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో శిశువు మాయం
భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో శిశువు మాయం కలకలం సృష్టించింది. ఖమ్మం జిల్లా చర్ల మండలం తేగడ గ్రామానికి చెందిన రాధ రెండో కాన్పు కోసం ఈ నెల 8న భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చేరింది. 9వ తేదీన సాధారణ కాన్పు ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చింది.
పసికందుకు కామెర్లు సోకడంతో ఆసుపత్రిలోని ఇంక్యుబేటర్‌లో ఉంచారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పాల కోసం శిశువుని తల్లి వద్దకు తీసుకొచ్చవారు. సోమవారం మధ్యాహ్నాం శిశువుకు పాలు పట్టించిన తర్వాత మళ్లీ ఇంక్యుబేటర్‌లో ఉంచారు.
అర్ధరాత్రి అయినా కూడా శిశువుని తల్లికి అప్పగించక పోవటంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు నర్సులను ఆరా తీయగా శిశువు మాయమైందని తెలిపారు. దీంతో శిశువు బంధువులు నర్సులపై దాడి చేశారు. గతంలో కూడా ఈ ఆసుపత్రిలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.
దీంతో రంగంలోకి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే రికార్డు రాయకుండా శిశువుని తీసుకుపోవడంతో శిశువు మాయమవడంలో ఆసుపత్రి సిబ్బంది హస్తం ఉందని అంటున్నారు. తమ శిశువుని అప్పగించాలంటూ ఆసుపత్రి ముందు తల్లిదండ్రులు, బంధువులు ధర్నాకు దిగారు.












Click it and Unblock the Notifications