జూబ్లీహిల్స్ ఎఫెక్ట్: గెలిచినా.. సురేఖ సహా ఆ మంత్రికి డేంజర్ బెల్స్..!!
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. ఈ గెలుపు ముఖ్యమంత్రి రేవంత్ కు ఇమేజ్ పెంచింది. తొలి నుంచి రేవంత్ ఈ ఎన్నికలో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. హైకమాండ్ సైతం ఎప్పటికప్పుడు ఆరా తీసింది. మంత్రులంతా పని చేసి భారీ మెజార్టీ తీసుకురావాలని స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా మంత్రులకు డివిజన్లు కేటాయించారు. అందరూ మెజార్టీ సాధించారు. ఇద్దరు మంత్రులు మాత్రం విఫలమయ్యారు. దీంతో.. ఇప్పుడు ఆ ఇద్దరి పైన ఎలాంటి చర్యలు ఉంటాయనేది ఉత్కంఠగా మారుతోంది.
జూబ్లీహిల్స్ లో గెలుపు ను కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. సీఎం రేవంత్ కు ఢిల్లీ పర్యటనలో మంత్రులను రంగంలోకి దించి.. అందరూ సమిష్టిగా గెలుపు కోసం పని చేయాలని నిర్దేశించింది. ప్రతీ రోజు మంత్రుల ప్రచార తీరు పైన నివేదికలు సేకరించింది. సీఎం రేవంత్ జూబ్లీహిల్స్ లో మంత్రులకు డివిజన్లు కేటాయించారు. ఆ డివిజన్లలో ప్రచారం నుంచి పోల్ మేనేజ్ మెంట్ వరకు బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గంలోని మొత్తం ఏడు డివిజన్లకు గాను ఒక్కో డివిజన్‌కు ఇద్దరు మంత్రుల చొప్పున కేటాయించారు. ఇందులో భాగంగా యూసుఫ్ గూడ డివిజన్‌ను మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌కు, రహమత్‌నగర్ డివిజన్‌ను కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కేటాయించారు.

అదే విధంగా వెంగళ్ రావునగర్ డివిజన్‌ను తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరికి, సోమాజిగూడ డివిజన్‌ను శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కు, షేక్‌పేట్ డివిజన్‌ను కొండా సురేఖ, వివేక్ వెంకట స్వామికి, ఎర్రగడ్డ డివిజన్‌ను మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావుకు కేటాయించారు. ఇక బోరబండ డివిజన్ బాధ్యతలను మంత్రి సీతక్కతోపాటు నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవికి అప్పగించారు. ఇక.. ఈ రోజు వెల్లడైన ఫలితాల్లో అన్ని డివిజన్లలో కాంగ్రెస్ తొలి నుంచి ఆధిక్యత ప్రదర్శించింది.
షేక్ పేటలో మాత్రం ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదు. దీంతో, ఆ డివిజన్ బాధ్యతలు పర్యవేక్షించిన కొండా సురేఖ, వివేక్ నుంచి నివేదికలు కోరినట్లుగా పార్టీ నేతల సమాచారం. గతంలోనే మెజార్టీ విషయంలో ఖచ్చితంగా వ్యవహరిస్తానని.. మంత్రుల సమర్థతకు మెజార్టీనే కీలకమని రేవంత్ తేల్చి చెప్పారు. దీంతో.. ఇప్పుడు ఈ ఇద్దరు మంత్రుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనే చర్చ పార్టీలో మొదలైంది.












Click it and Unblock the Notifications