‘కుంటాల’లో ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు: వీడియో తీశారు కానీ..
ఆదిలాబాద్: జిల్లాలోని కుంటాల జలపాతంలో ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు నీళ్లలో పడి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు.. గజఈతగాళ్లతో ఆదివారం రాత్రంతా వారి కోసం గాలింపు చేపట్టారు. అయినా ఫలితం లేకుండాపోయింది. దీంతో సోమవారం ఉదయం కూడా గాలింపు కొనసాగించారు.

అందాలను చూస్తూ..
కుంటాల జలపాతం చూసేందుకు నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు యువకులు వెళ్లారు. అక్కడి ప్రకృతి అందాలను చూసి మైమరిచి పోయిన యువకులు కుంటాల జలపాతంలో దిగారు.

వీడియోలు తీశారు కానీ..
180 అడుగుల ఎత్తున ఉన్న వాటర్ ఫాల్స్‌లో ఫోటోలు దిగే ప్రయత్నం చేశారు. ఇంతలో కాలు జారి జలపాతంలో పడిపోయారు. ప్రాణభయంతో వారు కేకలు వేస్తూ సాయం కోసం చేతులు ఊపారు. కానీ, ఆ సమయంలో పలువురు వారిని వీడియో తీస్తూ కాలం గడిపారు తప్ప వారిని రక్షించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం విచారకరం.

గజఈతగాళ్ల గాలింపు..
దీంతో వారిద్దరూ చూస్తుండగానే కొట్టుకుపోయారు. వారిని రక్షించే ప్రయత్నం చేసి ఉంటే వారు బతికేవారని వీడియోల్లో స్పష్టంగా అర్ధమవుతుంది. అనంతరం 11 మంది గజఈతగాళ్లు ఆదివారం రాత్రి నుంచి వారి కోసం వెతుకుతున్నారు.

ఇద్దరి మృతదేహాలు లభ్యం
ఆదివారం రాత్రి నుంచి గజఈతగాళ్లు కోసం గాలింపు చేపట్టగా.. సోమవారం ఉదయం యువకుల ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు యువకుల మృతి వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications