‘హైదరాబాద్ లిబరేషన్ డే’గా సెప్టెంబర్ 17: ఇక టీఎస్ కాదు TG
న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17కు సంబంధించి కీలక నిర్ణయం ప్రకటించింది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న 'హైదరాబాద్ విమోచన దినం' (Hyderabad liberation day)గా నిర్వహించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ రోజు అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని గెజిట్‌లో తెలిపింది.
'భారతదేశం స్వాతంత్ర్యం పొందాక హైదరాబాద్ సంస్థానం 13 నెలలపాటు నిజాంల పరిపాలనలోనే ఉంది. 1948 సెప్టెంబర్ 17న పోలీస్ చర్య 'ఆపరేషన్ పోలో'తో ఈ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినం నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్‌కు విముక్తి కల్పించిన అమరవీరులను స్మరించుకోవడానికి, యువతలో దేశభక్తి జ్వాలలు రగిల్చడానికి సెప్టెంబర్ 17న హైదరాబాద్ లిబరేషన్ డే' నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని ఆ గెజిట్ నోటిఫికేషన్‌లో వివరించింది.

ఇకపై TS కాదు.. TG
మరోవైపు, తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లపై టీఎస్ నుంచి టీజీ(TG)కి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంగళవారం గెజిట్ జారీ చేసింది. రిజిస్ట్రేషన్ కోడ్‌ను టీజీకి మార్చడానికి ఇటీవల జరిగిన మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ ప్రక్రియకు సంబంధించి అధికారులు కేంద్ర రవాణా శాఖతో సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలోనే దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్లు టీజీతో ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మంది టీజీని ఉపయోగించారని, అందుకే వాహనాల రిజిస్ట్రేషన్ మార్చాలని నిర్ణయించినట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications