రోహిత్‌తో గొడవలేదు, బాధాకరం: ఏబీవీపీ సుశీల్, 4గురు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేత
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన వేముల రోహిత్ ఆత్మహత్య పైన ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ మీడియా ఎదుట గురువారం తొలిసారి స్పందించారు. రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరమని చెప్పారు. ఏఎస్ఏ విద్యార్థులు తన పైన దాడి చేశారని చెప్పారు.
తాను ఆసుపత్రిలో చికిత్స కూడా పొందానని తెలిపారు. ఈ కేసులో బాధ్యులు ఎవరైనా కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చోశారు. రోహిత్‌తో తనకు ఎటువంటి గొడవలు లేవని చెప్పారు. కాగా, రోహిత్ ఆత్మహత్యకు కొందరు వామపక్ష ప్రొఫెసర్లు కారణమని, వారి ఒత్తిడి తట్టుకోలేకే అతను చనిపోయాడని సుశీల్ కుమార్ చెప్పిన విషయం తెలిసిందే.
నలుగురు విద్యార్థుల సస్పెన్షన్ ఎత్తివేత
వేముల రోహిత్ ఆత్మహత్యపై దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగతా నలుగురు విద్యార్థుల పైన సస్పెన్షన్ ఎత్తివేశారు. రోహిత్ సహా ఐదుగురి పైన సస్పెన్షన్ విధించారు. ఇప్పుడు నలుగురి పైన సస్పెన్షన్ ఎత్తివేశారు.

విద్యార్థులు ప్రశాంత్, శేషయ్య, విజయ్, సంకన్నల పైన సస్పెన్షన్ ఎత్తివేసినట్లు యూనివర్సిటీ వర్గాలు చెప్పాయి. సస్పెన్షన్ ఎత్తివేతకు ఎగ్జిక్యూటివ్ బోర్డ్ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. మరోవైపు, సస్పెన్షన్ ఎత్తివేసినట్లు తమకు సమాచారం లేదని విద్యార్థులు చెప్పారు.
దురదృష్టకరం: బాల్క సుమన్
హెచ్‌సియులో వేముల రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరమని ఎంపీ బాల్క సుమన్ అన్నారు. దోషులు ఎవరైనా వారిని కఠినంగా శిక్షించాలన్నారు. రోహిత్ ఆత్మహత్య పైన మొత్తం అట్టుడుకుతుంటే తెలంగాణ సీఎం కెసిఆర్ మౌనంగా ఉండటమేమిటని కాంగ్రెస్ నేత భట్టివిక్రమార్క ప్రశ్నించారు.
వివక్ష నిర్మూలించాలి: కోదండరామ్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వివక్షను పూర్తిగా నిర్మూలించాలని తెలంగాణ జెఏసి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. విశ్వవిద్యాలయాల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి లోపించిందని కంచ ఐలయ్య అన్నారు.
నా కొడుకు ఆశయ సాధనే లక్ష్యం: రోహిత్ తల్లి
తన కొడుకు (వేముల రోహిత్) ఆశయ సాధనే లక్ష్యమని రోహిత్ తల్లి రాధిక చెప్పారు. మిగతా నలుగురు విద్యార్థుల పైన సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆమె డిమాండ్ చేశారు. తన కొడుకు ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications