ఇదీ కేసీఆర్ స్టయిల్: గేట్లు వేసి మరీ బెదిరింపులు, ఇలాగేనా....

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఎవరికైనా ఉన్న మాట అంటే ఉలుకెక్కువ అంటారు. నిజాయితీగా వ్యవహరించాలనే సరికి ప్రతి ఒక్కరికి కడుపు మండుతుంది మరి. అధికారంలో ఉన్న వారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదని ప్రతీతి.

అందునా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అందుకు మినహాయింపు కాదని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలం మల్లన్నసాగర్ ముంపు గ్రామం వేములఘాట్ విషయమై సీఎం కేసీఆర్ వైఖరికి ప్రతిరూపంగా నిలిచింది.

మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల రైతులను నయానా భయానా నచ్చజెప్పి, బెదిరించో అదిరించో పలు గ్రామాల రైతుల భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. కేంద్రం ఆమోదించిన 'భూసేకరణ చట్టం - 2013' ప్రకారం పరిహారం చెల్లించాలని వేములఘాట్ రైతులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అదే తెలంగాణ ప్రభుత్వానికి కంటగింపుగా మారిందని చెప్తున్నారు.

ఆయన చెప్పిందే వేదమా? అని ఆవేదన

ఆయన చెప్పిందే వేదమా? అని ఆవేదన

విద్యుత్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిలువరిస్తూ ఇటీవల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై గ్రామస్తులు తీవ్ర నిరసన తెలిపారు. ‘నిక్కచ్చిగా, నిజాయితీగా ఉంటే ఆ దొరకు మింగుడుపడదు. అతను చెప్పిందే వేదం... ఆయన చేసిందే శాసనం. చెవులు ఊపితేనే ఆయన వాళ్లు. గట్లగాదంటే ఇష్టమొచ్చినట్టు సీఎం మాట్లాడుతుండ్రు. భూములు పోతున్నయి మొర్రో అంటుంటే బర్లిస్తం, గొర్లిస్తం, కోళ్లిస్తం, నలుగురికి ఒక ట్రాక్టర్లిస్తం, మళ్లీ మేమే గెలుస్తం, మా పాలనే వస్తుంది' అని సీఎం కేసీఆర్ అంటున్నారని వేములఘాట్‌ రైతులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM KCR Review Meeting On Tollywood Drug Scandal - Oneindia Telugu
సీఎం కేసీఆర్ బెదిరిస్తున్నారని ఆందోళన

సీఎం కేసీఆర్ బెదిరిస్తున్నారని ఆందోళన

నిజాయితీగా తమ పక్షాన నిలిచిన విపక్షాలు, మీడియా సంస్థలపై విమర్శలు గుప్పించడం సరి కాదని వేముల ఘాట్ వాసులు విమర్శిస్తున్నారు. 'మా భూములు కావాలంటూ సీఎం కేసీఆర్‌ గతనెల 22న ఫాంహౌస్‌కు చర్చలకు పిలిచిండు. 180 మంది రైతులదాకా వెళ్లినం. ఎకరానికి రూ.6లక్షలిస్తం. లక్ష అటు ఇటవుతది.. ఏమైనా ఫర్వాలేదు.. అంతా నేనే చూసుకుంటా. సంతకాలు పెట్టండి. ఎట్లయినా మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు కట్టి తీరుదాం. ఆగేదే లేదని దారుణంగా మాట్లాడిన సీఎంకు వందల ఎకరాల ఫాంహౌస్‌ అవసరమా?. ఆయన ఏమైనా నాగలి పట్టి దున్నుతడా? ఆయన కొడుకు ఏమైనా వ్యవసాయం చేస్తాడా? వాళ్లకెందుకు అంత భూమి? మా భూములు తీసుకుని సీఎం ఫాంహౌస్‌లో మాకు భూమి ఇస్తే సాగు చేసుకుని బతుకుతం. కానీ, ఆయన భూమి ఇవ్వడటగానీ మా భూములు కావాలంట?' అని తీవ్ర నిరసన తెలిపారు.

కన్నీటితో వెళ్లిపోతే హాయిగా తిని పోయారని దుష్ప్రచారం

కన్నీటితో వెళ్లిపోతే హాయిగా తిని పోయారని దుష్ప్రచారం

ఇంతకాలం తమ ఊళ్లకు రాని ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పామ్‌హౌస్‌లోకి చర్చలకని వెళ్తే తిని వెళ్లండని బతిమిలాడారని రైతులు చెప్పారు. ‘నచ్చని చోట మనస్ఫూర్తిగా ఎలా తింటామని, తమకు ఫలించని చర్చలతో కన్నీండ్లతో వెనుదిరిగి పోతే తిని పోయారని ప్రచారం చేసుకుంటున్నారు. ఇదేనా. సీఎం కేసీఆర్‌ సంస్కృతి' అని వేములఘాట్‌ రైతులు ఘాటుగా జవాబిచ్చారు. ఒక యువ రైతు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చెప్పిన దానిలో తమకు న్యాయం అనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఎట్లయినా ఫర్వాలేదు గానీ ఇంత దూరం వచ్చారు కనుక ఆకలితో ఉండి ఉంటారు తినిపొమ్మని చెప్పారన్నారు. తమ భూములు, ఇళ్లు సర్వం కోల్పోవాల్సి వస్తుంటే తమ కడుపులు మండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశాడు.

2013 చట్ట ప్రకారమే పరిహారం కావాలని డిమాండ్లు

2013 చట్ట ప్రకారమే పరిహారం కావాలని డిమాండ్లు

భోజనం చేయకుండా వెళతామంటే గేట్లు వేసి మరీ బెదిరించారన్నారు. కొంతమంది శనివారం ఒక్కపొద్దని చెప్పి తప్పించుకున్నరన్నారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం పేరిట తమ భూములు లాక్కునేందుకు తమను ఎన్నో రకాలుగా హింసించారని, లాఠీచార్జీలు చేశారన్నారు. తాము అడిగిన పరిహారం ఇవ్వనప్పుడు అక్కడ భోజనం ఎలా చేస్తామని రైతు సంఘం నాయకులు ప్రశ్నించారు. 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని అడిగామన్నారు. సీఎం కేసీఆర్ చేసిన చర్చలు విఫలమయ్యాయని, భోజనం చేయమంటే ఎలా చేస్తామని నిలదీశారు. మల్లన్నసాగర్‌ బాధితుల పక్షాన నిలిచి పరామర్శిస్తున్న ప్రతిపక్షాలు, మీడియాపై సీఎం కేసీఆర్‌ విరుచుకుపడటం ఆయన నైజమేనని, ఇది కొత్తేమీ కాదని రైతు సంఘం వ్యాఖ్యానించింది. తాను చెప్పిన సూచనలకు నచ్చితేనే సీఎం కేసీఆర్‌కు నచ్చుతుందని వేములఘాట్ వాసులు అభిప్రాయ పడుతున్నారు.

చర్చలు ఫలించకున్నా ఎలా తింటాం

చర్చలు ఫలించకున్నా ఎలా తింటాం

సీఎం కేసీఆర్ నిర్దేశిత ఆలోచనకు అనుగుణంగా లేకుంటే తమ అభిప్రాయాలన్నీ ఆయనకు పనికిరానివేనని వేముల ఘాట్ వాసులు అన్నారు. చర్చలంటూ పిలిచి 'సర్వే చేపించిన. మళ్లీ నేనే గెలుస్త. నేనే మళ్లీ సీఎం అయిత' అంటూ ఏదేదో మాకు చెప్పిండు. గవన్నీ మాకెందుకు. మీరు గెలిస్తేంది? ఓడితేంది? మాకేమొస్తది? ఫామ్‌హౌస్‌లో అన్నం తినాలంటూ కొందరిపై ఒత్తిడి చేసిండ్రు. పెద్దోలు జెప్పిరని ఒక్కరో ఇద్దరో మనసు చంపుకుని తినుంటరు. మేం తినలే. సొంత ఖర్చులతోనే వెళ్లొచ్చినం. నాకు తెలిసి మా ఊరు నుంచి పోయిన వారిలో ఒక్కరు కూడా అన్నం తినలేదు' అని చెప్పారు.

ఎలాగైనా రిజర్వాయర్ నిర్మిస్తామని బెదిరింపులు

ఎలాగైనా రిజర్వాయర్ నిర్మిస్తామని బెదిరింపులు

వాస్తవాల ప్రాతిపదికన సమాధానం చెప్తూ, అధికారులను ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తూ అరెస్ట్ చేస్తున్నారని వేములఘాట్ రైతు పోరెడ్డి జనార్దన్ తెలిపారు. సీఎం కేసీఆర్ తమకు నచ్చేలా చల్లని విషయం చెబితే తినుండే వాళ్లమేమో గానీ భూములు ఇచ్చినా, ఇవ్వక పోయినా డ్యాం కట్టడం ఆగదంటూ మాట్లాడిన సీఎం తిని పొమ్మంటే తింటామా? భూమికి భూమి ఇవ్వండి. లేదా మీ ఫాంహౌస్‌లో మాకు భూమి ఇవ్వండి అని ఆయన చెప్పారు. కర్ణాకర్ రెడ్డి అనే మరో రైతు మాట్లాడుతూ భూమి గుంజుకుని బువ్వ తినమంటే ఎట్ల తింటం? అని నిలదీశాడు. బర్లు, గొర్లు, ట్రాక్టర్లు అంటూ సీఎం కేసీఆర్ అసంబద్ధంగా మాట్లాడడం తమపై చేసిన లాఠీ చార్జీలు, నిర్భందాలను కండ్లకు కట్టినట్టు చూపకుండా ఈ ప్రాంతంలో టీవీ చానళ్ల ప్రసారాలు రద్దు చేశారని బాల్ రెడ్డి అనే రైతులు తెలిపారు.

ఉన్న పశువుల రక్షణ కష్టమంటే కొత్తవాటినేం చేసుకోవాలి

ఉన్న పశువుల రక్షణ కష్టమంటే కొత్తవాటినేం చేసుకోవాలి

సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్‌, టీడీపీ వాళ్లు అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ మాట్లాడుతున్న సీఎం తమ గ్రామాల్లోకి వచ్చి తమతో ఎందుకు మాట్లాడట్లేదని వేముల ఘాట్ వాసులు ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు ఆంధ్రోళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీపుమీద కొడితే ఇపుడు తెలంగాణలో సీఎం కేసీఆర్‌ తమ కడుపుల మీద కొడ్తుండన్నారు. తమ కష్టాలను విని రమ్మన్నారేమో అనుకున్నామని, కానీ గాడ్కిబోతే బర్లు, గొర్లు, ట్రాక్టర్లు ఇస్తమని ఆశజూపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నవాటినే ఏంజేస్కోవాలో వశమైతలేదన్నారు. ఇక ప్రభుత్వం ఇచ్చే బర్లు, గొర్లు ఏం చేసుకోవాలని నిలదీస్తున్నారు. భూమి పోతే వ్యవసాయం చేసేవాడికి అసలు బాధ తెలుస్తుందన్నారు. తమకు న్యాయం జేస్తే తమ భూములిస్తామన్నారు. కాదూ కూడదని మొండిగా డ్యామ్‌ కడ్తరంటరా? అయితే తమ శవాల మీద కట్టుండ్రి అని నిరసించారు.

నచ్చకున్నా సీఎం మాటలకు చప్పట్లు కొట్టాలా

నచ్చకున్నా సీఎం మాటలకు చప్పట్లు కొట్టాలా

భూమి పోతుందని మనాది పెట్టుకున్నమని బిక్షపతి అనే హమాలీ కం రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా పెండ్లాం, పిల్లలు ఒప్పుకోరు. భూమి పోతున్నదని మనాది పెట్టుకుండ్రు. ఒకటే ఏడుస్తుండ్రు అని అంటే.. ఒప్పించుకొండ్రి. గివన్నీ నాకుజెప్తరా?' అంటూ సీఎం వెకిలిగా నవ్విండు. ‘డీసీఎంలు ఇస్తాం. నలుగురు కలిసి తీసుకొండి అన్నడు. అంటే మేము తన్నుకోవాలనే గదా. గిసోంటి మాటలను మేము వినం. ఎంతకాలమైన సరే పోరాడుతం. మొత్తం భూసేకరణ అయిందని కలెక్టర్‌ కూడా అబద్దాలు చెబుతుండు. మీరు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఆగదంటుండు. మాకు మా గ్రామాన్ని నిర్మించివ్వండి. వసతులు కల్పియిర్రి. 2013 చట్టం ప్రకారం భూ సేకరణ చేయిండ్రి. అంతే తప్ప ప్రతిపక్షాలపై, మీడియాపై విమర్శలు తగవు' అని బిక్షపతి వ్యాఖ్యానించాడు. ఇదంతా ఇట్ల ఉంటే చర్చల్లో పాల్గొంటున్నప్పుడు తమకు నచ్చని మాటలు సీఎం కేసీఆర్ చెప్తుంటే చప్పట్లు కొట్టమని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు.

భూమి పోతే బాధ తెలుస్తుందన్న బాధితులు

భూమి పోతే బాధ తెలుస్తుందన్న బాధితులు

తమకు నచ్చని మాటలు చెబితే సప్పట్లు ఎట్ల కొడ్తం? బర్లు..గొర్లు...ఎకరానికి రూ.6లక్షలిస్తమంటే కండ్లు మూసుకుని సంతకాలు పెడ్తమా? లోపలికి పత్రికలొల్లను సీఎం ఎందుకు రానియ్యలే? పత్రికోళ్లు వస్తే గుట్టు బయటపడుతదనుకున్నడా?' అని వేములఘాట్ రైతులు నిలదీస్తున్నారు. ‘మమ్మల్ని చంపినా మా భూములివ్వం. ఇన్ని ఇండ్లు కూలగొట్టి పొలాలు గుంజుకుని మల్లన్నసాగర్‌ కట్టుండి. మమ్మల్ని ఇండ్లనే బొంద పెట్టుండ్రి. మా భూములు లాక్కుంటే మేం ఏం చేసి బతకాలే? మేం భూముల కోసం గిన్ని బాధలు పడ్తుంటే ఎన్నడన్న ఎమ్మెల్యే రామలింగారెడ్డి ముఖం చూపెట్టిండా? మా మంచిచెడు తెలుసుకున్నడా?ఫాంహౌస్‌లకి పోవంగనే అన్నం తినుపోరి అంటే ఎట్ల తింటం? ఈ సర్కారోళ్లను మైసమ్మ తల్లి మింగాలే. ఇంత అన్యాయామా?' అని వేములఘాట్ వాసి గండ్ల నర్సమ్మ వాపోయారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Vemulaghat villagers angered on CM K chandra Shekhar Rao comments on Opposition partles and Media. They said that 'how can give our lands to constrution of Mallanna Sagar with our consent'. Villagers asked the CM KCR Why aren't permitted Media into Farm House.
Please Wait while comments are loading...