రేవంత్ రెడ్డి సర్కారుకు వెంకయ్య నాయుడు ప్రశంసలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నుంచి ప్రశంసలు అందుకున్నారు. రైతు రుణమాఫీ మార్గదర్శకాలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను స్వచ్ఛమైన తెలుగులో జారీ చేయడం పట్ల వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) వేదికగా తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు.
'ప్రభుత్వ ఉత్తర్వులు తొలిసారి తెలుగులో జారీ చేయడం చాలా సంతోషకరం. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు సహా పరిపాలనకు సంబంధించిన అంశాలు తెలుగులో జారీ చేయాలని నేను ఎప్పటినుంచో సూచిస్తూనే ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం తొలిసారి తెలుగులో, అందులోనూ రైతుల రుణమాఫీ మార్గదర్శకాలపై తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయం' అని వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు.

'ప్రజల కోసమే పరిపాలన అయినప్పుడు వారికి సులువుగా. అర్థమయ్యే భాషలోనే ప్రభుత్వ ఉత్తర్వులు, పరిపాలనకు సంబంధించి ఇతర సమాచారం ఉండాలని నేను ఎప్పటినుంచో చెబుతున్నాను. ప్రజల సౌలభ్యానికి ప్రాధాన్యమిస్తూ తెలుగులో ఉత్తర్వులు జారీ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావుకి, ఈ ఉత్తర్వుల రూపకల్పనలో పాలుపంచుకున్న ఇతర అధికారులు, సిబ్బందికి అభినందనలు' అని మాజీ ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
అంతేగాక, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇక నుంచి అన్ని ఉత్తర్వులను, సమాచారాన్ని పూర్తిగా తెలుగులోనే అందించాలని ఆకాంక్షించారు వెంకయ్యనాయుడు. ఈ నేపథ్యంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పోస్టుపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
'రైతు రుణమాఫీ మార్గదర్శకాలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను స్వచ్ఛమైన తెలుగులో జారీ చేయడటం పట్ల తన హర్షాన్ని వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేసిన... మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుకి హృదయపూర్వక ధన్యవాదాలు' అంటూ సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా స్పందించారు.












Click it and Unblock the Notifications