Venu Swamy: బంగారం ధర రూ. 5 లక్షలు! వేణుస్వామి షాకింగ్ జోస్యం..
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రానున్న ఐదేళ్ల కాలంలో ఆర్థిక రంగంలో పెనుమార్పులు సంభవించే అవకాశం ఉందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన జోస్యం చెప్పారు. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన భవిష్యత్తు పరిస్థితులపై తీవ్ర హెచ్చరికలు చేశారు. రాబోయే రోజుల్లో బంగారం ధరలు అసాధారణ రీతిలో పెరిగిపోతాయని, కేవలం ఐదేళ్లలో తులం బంగారం రేటు రూ. 5 లక్షలు దాటుతుందని ఆయన కుండబద్దలు కొట్టారు. అంతేకాకుండా, వెండి ధరలు పసిడిని మించి ఏకంగా రూ. 6 లక్షలకు చేరుకుంటాయని ఆయన అంచనా వేశారు.

కేవలం విలువైన లోహాలే కాకుండా, సామాన్య ప్రజల నిత్యవసర వస్తువుల ధరలు, రవాణా వ్యవస్థలు కూడా పూర్తిగా మారిపోతాయని వేణుస్వామి హెచ్చరించారు. రాబోయే రోజుల్లో కిలో బియ్యం ధర రూ. 200కి చేరి 25 కిలోల రైస్ బ్యాగ్ రూ.5000కు చేరుతుందని, లీటర్ పాలు ధర కూడా రూ. 200కి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. భవిష్యత్తులో గ్యాస్, పెట్రోల్ వంటి ఇంధనాలు దాదాపుగా దొరకని పరిస్థితి ఏర్పడవచ్చని, మొబైల్ నెట్‌వర్క్‌లు సైతం బంద్ అయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ), సోలార్ విద్యుత్ మీద మాత్రమే ఆధారపడాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ప్రజలు సాధ్యమైనంత త్వరగా సోలార్ విద్యుత్ వైపు మళ్లాలని, ఈవీ వాహనాలను కొనుగోలు చేయాలని ఆయన సూచించారు.
సమాజంలో మతం, మానవ సంబంధాల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం మతం గురించి మాట్లాడితే నెత్తిన పెట్టుకుంటున్న సమాజం, రానున్న రెండు మూడేళ్ల తర్వాత దొంగలను చూసినట్లు చూస్తుందని వేణుస్వామి అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ప్రజలు మతం గురించి కాకుండా "మనకు తిండి ఎవరు పెడతారు?" అనే కోణంలో మాత్రమే ఆలోచిస్తారన్నారు. మతాన్ని పూర్తిగా పక్కన పెట్టేవి రెండే రెండు అంశాలని, అవే ఒకటి 'ఆకలి', మరొకటి 'ప్రాణాపాయం' అని ఆయన స్పష్టం చేశారు.
ఈ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలు ఇప్పటి నుంచే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వేణుస్వామి హితవు పలికారు. తను నమ్మే అనుచరులు, ప్రజలు సంవత్సరానికి సరిపడా ధనాన్ని తమ దగ్గర ఉంచుకోవాలని సూచించారు. బ్యాంక్ ఖాతాలలో ఎంత డబ్బు ఉన్నప్పటికీ, అత్యవసర సమయాల్లో చేతిలో ఖచ్చితంగా క్యాష్ ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, రాబోయే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ సంవత్సరానికి సరిపడా నిత్యవసర వస్తువులను ఇళ్లలో నిల్వ చేసుకోవాలని ఆయన ఆ ఇంటర్వ్యూలో హెచ్చరించారు.














Click it and Unblock the Notifications
