రేవంత్ రెడ్డిపై పోలీసులకు వీహెచ్ ఫిర్యాదు..చంపేస్తారంటూ కాల్స్: ఆడియో వైరల్
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ పదవికి పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమించే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఢిల్లీ నుంచి లీకులు కూడా వచ్చేశాయి. ఈ వార్తలపై కాంగ్రెస్ కురవృద్ధుడు మాజీ ఎంపీ వీ హనుమంతరావు ఘాటుగా స్పందించారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని ఎలా నియమిస్తారంటూ ప్రశ్నించని వీహెచ్... ఆయన ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తి అని విమర్శించారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ ఆడియో క్లిప్పింగ్ వైరల్ అయ్యింది. రేవంత్ రెడ్డి అభిమానిగా చెప్పుకునే ఓ వ్యక్తి వీహెచ్‌కు ఫోన్ చేసి బెదిరించిన ఆడియో క్లిప్పింగ్ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే వీహెచ్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
రేవంత్ రెడ్డి నుంచి అతని అనుచరుల నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ కాంగ్రెస్ కురవృద్ధుడు వీహెచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసినా, వ్యతిరేకంగా మాట్లాడినా చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చినట్లు ఫిర్యాదులో వీహెచ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ వ్యక్తని కాంగ్రెస్‌కు ఏం చేయలేదని వీహెచ్ అనగా... మరి ఇంతకాలం కాంగ్రెస్‌లో ఉండి తామేమి సాధించారని ఆ గుర్తు తెలియని వ్యక్తి ప్రశ్నించడం ఆడియోలో వినిపించింది. అంతేకాదు వీహెచ్‌పై అసభ్యకర పదజాలం ఆ వ్యక్తి వాడాడు.

ఇక తనను చంపేస్తానంటూ పలువురు బెదిరస్తున్నారంటూ వీహెచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ వ్యక్తిని ట్రేస్ చేయాల్సిందిగా కోరారు. ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా కనుక్కోవాలని కోరారు. వీహెచ్ ఇచ్చిన ఫిర్యాదులో రేవంత్ రెడ్డి పేరును కూడా చేర్చారు. తెలంగాణలో ఇక వేరే ఏ నాయకులు లేనట్టుగా పార్టీలు మారిన రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఎలా ఇస్తారని వీహెచ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అదే జరిగితే తాను కాంగ్రెస్‌ను వీడుతానని కూడా హెచ్చరించారు. కోమటిరెడ్డి లాంటి నాయకులు కాంగ్రెస్‌లో ఉండగా ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తి, టీడీపీలో ఉండి ఆ పార్టీని భ్రష్టు పట్టించి ఆ పై కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఎలా కట్టబెడతారని వీహెచ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications