హైదరాబాద్ వైద్యురాలి 8 ఏళ్ల పోరాటం.. FSSAI సంచలన నిర్ణయం.. ఇకపై..
ఇటీవల కోల్డ్ రిఫ్ అనే దగ్గు మందు వికటించి మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 22 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా తెలంగాణతోపాటు అనేక రాష్ట్రాల్లో కోల్డ్ రిఫ్ దగ్గు సిరప్ ను నిషేధించాయి. అయితే తాజాగా హైదరాబాద్ కు చెందిన చిన్న పిల్లల డాక్టర్ శివరంజని 8 ఏళ్ల పోరాటం ఫలించింది. ఆమె సుదీర్ఘ పోరాటానికి ఫలితంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండార్ట్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా (FSSAI) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) ప్రమాణాలకు అనుగుణంగా లేని ఎనర్జీ డ్రింక్స్, ఇతర పానీయాలపై ORS(ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) లేబుల్ ఉపయోగించొద్దని FSSAI ఆదేశాలు జారీ చేసింది. దీంతో డాక్టర్ శివరంజని 8 ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కింది.
హైదరాబాద్ కు చెందిన పీడియాట్రీషియన్ డాక్టర్. శివరంజని 8 ఏళ్లుగా నకిలీ ఓఆర్ఎస్ లపై పోరాటం సాగిస్తున్నారు. నకిలీ ఓఆర్ఎస్ సమస్యను ముందుగానే గుర్తించించి డాక్టర్. శివరంజని.. వీటిపై 2017 నుంచి సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తున్నారు. సాధారణంగా ఓఆర్ఎస్ ను వైద్యులు ఎప్పుడు సూచిస్తారు అంటే..? అతిసారం, డయేరియాతో బాధపడుతున్న పిల్లలు, పెద్దవారికి ఓఆర్ఎస్ అందిస్తారు. ఇందులో గ్లూకోజ్ స్థాయి కీలకంగా ఉంటుంది. సాధారణంగా వంద మిల్లీలీటర్ల ORS ద్రావణంలో 1.35 గ్రాముల గ్లూకోజ్ ఉండాలి. అయితే నకిలీ ORS లో గ్లూకోజు స్థాయి వంద మిల్లీలీటర్ల ద్రావణంలో 8 నుంచి 12 గ్రాముల వరకు ఉంటుంది. అంటే ఉండాల్సిన దానికంటే 10 రెట్లు ఎక్కువ చక్కెర ఉంటుందని వైద్యురాలు శివరంజని చెబుతూ వస్తున్నారు.

ఇలా ORS లో అధిక చక్కెర పిల్లల ప్రాణాలకు ముప్పుగా మారుతుందని వైద్యురాలు శివరంజని చెబుతున్నారు. ఇక డయాబెటిక్ రోగులైతే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని వివరిస్తున్నారు. ఇదే విషయంపై ఆమె గత 8 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. అయితే ఆమె పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఈ మేరకు ఇటీవల FSSAI కీలక నిర్ణయం తీసుకుంది. ఎనర్జీ డ్రింక్స్, ఇతర పానీయాలపై ORS లేబుల్ ఉపయోగించడాన్ని FSSAI నిషేధించింది. ఈ మేరకు నకిలీ ORS లపై తన పోరాటం ఫలించిందంటూ ఇన్ స్టా గ్రామ్ వేదికగా వైద్యురాలు శివరంజని ఎమోషనల్ పోస్టు పెట్టారు.
"మనం గెలిచాం. స్పష్టమైన క్లారిటీ ఈరోజు జారీ అయింది. ఇకపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) ప్రమాణాలకు అనుగుణంగా లేని ORS లను ఎవరూ విక్రయించొద్దు. వీటిని ఈరోజు నుంచి ఎప్పుడూ అమ్మవద్దు. థ్యాంక్యూ FSSAI. థ్యాంక్యూ ప్రధాని నరేంద్రమోదీ.. ఈ పోరాటంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని తన ఇన్ స్టా ఖాతాలో వైద్యురాలు శివరంజని పోస్టు చేశారు.
అయితే.. FSSAI ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ, ORSL తయారీదారు జేఎన్‌టీఎల్ కన్స్యూమర్ హెల్త్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. వారి వాదనలు విన్న న్యాయస్థానం.. FSSAI జారీ చేసిన ఉత్తర్వుల అమలును.. జేఎన్‌టీఎల్ విషయంలో నిలిపివేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు దిల్లీ హైకోర్టు జస్టిస్ సచిన్ దత్తా కీలక తీర్పును వెల్లడించారు. జేఎన్‌టీఎల్ దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం విచారణలో ఉందని.. తుది నిర్ణయం తీసుకునే వరకూ FSSAI జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయరాదని జస్టిస్ సచిన్ దత్తా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications