అలా వెళ్లగానే కూలింది: మేయర్ బొంతు రామ్మోహన్‌కు తప్పిన ప్రమాదం
కూలిన భవనం గోడను పరిశీలించేందుకు వెళ్లిన మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్ధన్ రెడ్డిలు మంగళవారం నాడు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
హైదరాబాద్: సోమవారం నాడుహైదరాబాదులో ఓ భవనం గోడ కూలింది. దీనిని పరిశీలించేందుకు వెళ్లిన మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్ధన్ రెడ్డిలు మంగళవారం నాడు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వారు పరిశీలించి వెళ్లిన కాసేపటికే ఆరో అంతస్తు గోడ కూలడం గమనార్హం.
సికింద్రాబాదులోని చంద్రలోక్ కాంప్లెక్స్ వద్ద మేయర్ బొంతు, కమిషనర్ జనార్దన్ రెడ్డిలు పర్యటించారు. భవనం స్థితిగతులను పరిశీలించారు. సోమవారం సాయంత్రం చంద్రలోక్ కాంప్లెక్స్ భవనం గోడ కూలి దుర్గయ్య మృతి చెందాడు.

ఘటనాస్థలాన్ని మేయర్, కమిషనర్‌లు ఉన్నతాధికారులతో కలిసి ఉదయం పరిశీలించారు. 40 సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన భవనం కావడం, నిర్వహణ లోపం వల్లే ఈ ఘటన జరిగిందని మేయర్ తెలిపారు.
జేఎన్‌టీయూ ఇంజినీర్లతో కమిటీ వేసి, ఆ కమిటీ నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. భవన సముదాయాన్ని పూర్తిగా మూసివేశామన్నారు. దుర్గయ్య కుటుంబానికి రెండున్నర లక్షల రూపాయల పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, మేయర్, కమిషనర్ వెళ్లిన కాసేపటికే ఆరో అంతస్థు గోడ కూలింది. అందరూ వెళ్లిన తర్వాత గోడ కూలడంతో పెను ప్రమాదం తప్పింది.












Click it and Unblock the Notifications