సారిక, ముగ్గురు పిల్లల మృతి: పోలీసులు అదుపులో సనా, వైద్య పరీక్షలు
వరంగల్: మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల సజీవ దహనం కేసులో నాలుగో నిందితురాలైన అనిల్ రెండో భార్య సనా పోలీసుల అదుపులోనే ఉంది. ఆమెను పోలీసులు నాలుగో ముద్దాయిగా చేర్చిన విషయం తెలిసిందే.
సనాకు శుక్రవారంనాడు పోలీసులు వరంగల్‌లో ఎంజిఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరు పరుస్తారు. సనాను అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ పోలీసులు ఇప్పటి వరకు కూడా ధ్రువీకరించలేదు.

సారిక మృతి కేసులో కీలకమైన విషయాలను రాబట్టేందుకు పోలీసులు సనాను ప్రశ్నించినట్లు సమాచారం. ఆమెను రహస్యంగా విచారించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఖమ్మం నగరంలో శనివారం రాత్రి ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే, సనాను తాము అరెస్టు చేయలేదని ఇటీవల పోలీసు కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు. సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతి కేసులో పోలీసులు ఇప్పటికే రాజయ్యను, ఆయన కుమారుడు అనిల్‌ను, భార్య మాధవిని అరెస్టు చేశారు. రాజయ్య, మాధవిల బెయిల్ పిటిషన్‌ను కోర్టు రెండోసారి తిరస్కరించింది.
సనకు రిమాండ్
సారిక, ముగ్గురు మనవళ్ల సజీవదహనం కేసులో ఏ4 నిందితురాలు సనాకు వరంగల్ జిల్లా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆమెను కేంద్ర కారాగారానికి తరలించారు. రాజయ్య ఇంట్లో ఘటన జరిగినప్పటి నుంచీ ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. దాంతో హన్మకొండ పోలీసులు ప్రత్యేక బృందంతో గాలింపు చేపట్టి ఇటీవల ఖమ్మం జిల్లాలో సనను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications