weather update: తెలంగాణలో కొనసాగనున్న భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఈదురుగాలులు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. కాగా, బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. మరో రెండు మూడు రోజులపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈదురుగాలులు
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో కురుస్తాయని పేర్కొంది. రానున్న రెండు రోజుల్లు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీయనున్నాయని వెల్లడించింది. బుధవారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే బుధవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి..
పశ్చిమమధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల దగ్గర కొనసాగిన అల్పపీడనం మంగళవారం కాస్త బలహీనపడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ద్రోణి దక్షిణ ఒడిశా నుంచి ఉత్తర కోస్తాంధ్రా మీద కొనసాగుతూ మధ్యస్థ ట్రోపో స్పియర్ స్థాయి వరకు వ్యాపించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి వైపునకు వంపు తిరిగి ఉంది. దీని ప్రభావం కారణంగా రానున్న రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

నిండుకుండల్లా చెరువులు.. మూసి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
ఇక తెలంగాణలో హైదరాబాద్ తోపాటు దాదాపు అన్ని జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నిండిపోయాయి. వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు మూసి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిపోయింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా, ఇప్పుడు 642 అడుగులకు చేరింది. దీంతో అధికారులు ఆరు గేట్లను ఎత్తి 3600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. తెలంగాణలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు భారీ వర్షాలతో నిండుకుండలా మారాయి. విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications