Rain: తెలంగాణలో ఆగని వానలు, ఈ జిల్లాల్లో భారీ వర్షాల అలర్ట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు తగ్గినప్పటికీ.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. శుక్రవారం కూడా హైదరాబాద్ తోపాటు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. తాజాగా, మరోసారి వాతావరణ శాఖ మూడు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని వెల్లడించింది.
దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శని, ఆదివారాల్లో తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

రానున్న మూడు, నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
అంతేగాక, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఢిల్లీలో తేలికపాటి వర్షాలు కురిశాయి. కాగా, ఆలస్యంగా వచ్చిన నైరుతీ రుతుపవనాలు క్రియశీలకంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 9 నుంచి అవి తిరోగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ముందస్తుగానే ఈశాన్య రుతుపవనాల రాక మొదలు కావొచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.












Click it and Unblock the Notifications