కాళ్లు మొక్కి కాపలా కుక్కనన్నావ్‌గా, సోనియా తలచుకోకుంటే: కేసీఆర్‌పై ఉత్తమ్, చంద్రబాబుకు మద్దతు
హైదరాబాద్: ప్రజాకూటమిని చూసి తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వణికిపోతున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ లాగు తడుస్తుందని కేసీఆర్ విమర్శించడంపై కౌంటర్ ఇచ్చారు. అసలు ప్రధాని నరేంద్ర మోడీని చూస్తే కేసీఆర్‌కు లాగు తడుస్తోందన్నారు.
నాడు తెలంగాణ ఇచ్చినప్పుడు తమ పార్టీ నాయకురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కాళ్లు మొక్కి, కాపలా కుక్కలా ఉంటానని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. సోనియా, రాహుల్ గాంధీల గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అవినీతిలో నెంబర్ వన్ అయిందన్నారు.

అధికార దాహంతో కేసీఆర్ ఉద్యమం
కేసీఆర్ అధికార దాహంతో ఉద్యమం చేశారని ఉత్తమ్ అన్నారు. గద్దెనెక్కుతూనే కేసీఆర్ జనాన్ని మోసం చేశారని చెప్పారు. ప్రజా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. అప్పుడు తెలంగాణను వ్యతిరేకించిన మజ్లిస్ పార్టీ ఇప్పుడు కేసీఆర్‌కు తొత్తులా వ్యవహరిస్తోందని చెప్పారు. తెలంగాణను కేసీఆర్ భ్రష్టు పట్టించారన్నారు. ఇప్పుడు మనం ఉనికి కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు.

ఫాంహౌస్‌కు కేసీఆర్, అమెరికాకు కేటీఆర్
ఈ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫాం హౌస్‌కు, కేటీఆర్ అమెరికాకు వెళ్లిపోవడం ఖాయమని చెప్పారు. సర్పంచ్‌ల నుంచి ఎంపీల వరకు అందరినీ కొనుక్కున్న చరిత్ర కేసీఆర్‌ది అని చెప్పారు. ఉద్యమం సమయంలో కేసీఆర్ దొంగ దీక్షను తామే బయటపెట్టామని చెప్పారు. తండ్రీ కొడుకులు నా గురించి చాలా తప్పుగా మాట్లాడారని చెప్పారు.

సెంటిమెంట్ ఓ ముసుగు
ఒక పైలట్‌గా దేశ రక్షణ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమై పోరాడానని ఉత్తమ్ చెప్పారు. తమకు పిల్లలు లేరని, తెలంగాణ ప్రజలే తమ కుటుంబమని చెప్పారు. ఈ జీవితం తెలంగాణ కోసమే అన్నారు. తెరాస మళ్లీ అధికారంలోకి వస్తే సామాన్యుడు బతకలేడని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్‌లకు తెలంగాణ సెంటిమెంట్ అనేది ఓ ముసుగు అన్నారు. కేసీఆర్ పాలనలో అణగారిన వర్గాలకు మాట్లాడే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు.

ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు
కేసీఆర్ కుటుంబానికి ప్రజల మీద కంటే అధికారం మీదే మోజు అని ఉత్తమ్ అన్నారు. ఇంటింటికి మంచినీళ్లు ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఆ మాటను నిలబెట్టుకోలేదని చెప్పారు. ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారో చెప్పాలన్నారు. మిషన్ భగీరథలో కమీషన్లు తీసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టులు అన్నారు. కాంట్రాక్టర్ల నుంచి తీసుకున్న కమీషన్‌ను ఇప్పుడు పంచుతున్నారన్నారు.

మీ సంస్కృతి మాకు అంటగడతావా?
విద్యార్థుల ఫీజు రీయింబర్సుమెంట్ ఎందుకు సక్రమంగా సాగలేదని ఉత్తమ్ చెప్పారు. మీకున్న సూట్‌కేసుల సంస్కృతి మాకు అంటగడతావా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఆదివారం బహిరంగ సభల్లో మాట్లాడుతూ... సోనియా గాంధీ తెలంగాణ విషయంలో ఎందుకు బాధపడుతున్నారని, అప్పుడు అందినట్లుగా సూటుకేసులు ఇప్పుడు అందటం లేదని కడుపు తరుక్కుపోతుందా అని కేసీఆర్ ప్రశ్నించారు. దీనిపై ఉత్తమ్ ఘాటుగా స్పందిస్తూ.. మీకున్న సూటుకేసుల సంస్కృతిని మాకు అంటగడతావా అన్నారు.

సోనియా తలచుకోకుంటే తెలంగాణ వచ్చేది కాదు
తెలంగాణ ఇవ్వడాన్ని పార్లమెంటులోనే మోడీ తప్పుబట్టారని ఉత్తమ్ అన్నారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సోనియా తెలంగాణ ఇచ్చారని చెప్పారు. సోనియా తలుచుకోకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. కేసీఆర్ నిస్సిగ్గుగా తమ మేనిఫెస్టోను కాపీ కొట్టారని చెప్పారు.

చంద్రబాబు ఏం అడ్డుకున్నారో చెప్పాలని సవాల్
కేసీఆర్ ఓటమి భయంతోనే తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఉత్తమ్ అన్నారు. తెలంగాణలో జరిగిన ఏ అభివృద్ధిని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారో చెప్పాలని సవాల్ చేశారు. తెలంగాణలో దళితుడిని ముఖ్యమంత్రి చేయవద్దని తెరాసకు చంద్రబాబు అడ్డుపడ్డారా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications