'వర్మ రూ.5 కోట్ల ఆఫర్, శ్రీరెడ్డితో డ్రామా.. వెనుక ఎవరు? పీఆర్పీలో చూశాం.. పవన్! జాగ్రత్త'
Recommended Video

హైదరాబాద్: సినీ నటి శ్రీరెడ్డి వివాదం చినికి చినికి వాన అవుతోంది. దానికి రాజకీయ రంగు పులుముకుంటోంది. అందుకు కారణాలు కూడా చూపిస్తున్నారు. శ్రీరెడ్డి... ఆ తర్వాత ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ రంగంలోకి దిగడం.. పదేపదే ఆమె పవన్ కళ్యాణ్‌ను విమర్శించడం.. వంటి అంశాలు తరిచి చూస్తే ఆమె వెనుక ఎవరో ఉన్నారనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వస్తున్నారు. బుధవారం నాగబాబు మీడియా ఎదుట మాట్లాడారు. దీని వెనుక రాజకీయ శక్తి ఉందని ఆరోపించారు. ఆ తర్వాత రామ్ చరణ్ కూడా స్పందించారు. తాజాగా, గురువారం నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు.

పవన్ కళ్యాణ్‌ను విమర్శించడంపై ఆగ్రహం
పవన్‌ను టార్గెట్ చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా శ్రీరెడ్డి తన ఆందోళన నిర్వహించుకోవచ్చునని, కానీ రామ్ గోపాల్ వర్మ చెబితే ఆమె పవన్ కళ్యాణ్‌ను విమర్శించడాన్ని అల్లు అరవింద్ తీవ్రంగా తప్పుబట్టారు. దీనిని బట్టే ఏదో కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వర్మ పైన ఆయన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

5 కోట్లు ఇచ్చేందుకు ఎందుకు సిద్ధమయ్యాడు?
పవన్ కళ్యాణ్‌ను తిట్టమని శ్రీరెడ్డికి తానే చెప్పానని వర్మనే చెప్పాడని, ఆమె ఎలాగు చెబుతుందని బయటపెట్టాడని, అసలు పవన్‌ను టార్గెట్ చేయమని ఎందుకు చెప్పారని అల్లు అరవింద్ నిలదీశారు. వర్మ ఆర్థిక పరిస్థితి తనకు తెలుసునని, అలాంటి వర్మ రూ.5 కోట్ల ఆఫర్ చేశాడని, ఆయనకు అంత డబ్బు ఎక్కడిది అని ప్రశ్నించారు. ఐదు కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ఎందుకు సిద్ధమయ్యాడని ప్రశ్నించారు. అంత డబ్బు నీకు ఎక్కడిదని నిలదీశారు.

వర్మ కుట్ర వెనుక ఎవరు ఉన్నారు?
పవన్ కళ్యాణ్ అంటే, ఆయన కుటుంబం అంటే వర్మకు కోపం అని, అభిమానులు అంటే ఆగ్రహం అని, అలా అని చెప్పి శ్రీరెడ్డితో తిట్టిస్తారా అని అల్లు అరవింద్ ప్రశ్నించారు. అసలు పవన్‌ను తిట్టిచ్చిన కుట్ర వెనుక ఎవరు ఉన్నారని ప్రశ్నించారు. శ్రీరెడ్డిని ఉపయోగించుకొని పవన్ పైన కక్ష తీర్చుకుంటారా అని నిలదీశారు.

పవన్ కళ్యాణ్! జాగ్రత్తగా ఉండు
వర్మ ఇప్పుడు చేస్తున్న డ్రామాలు, పన్నాగాలు తమకు పదేళ్ల క్రితం ప్రజారాజ్యం పార్టీలోనే ఎదురయ్యాయని అల్లు అరవింద్ చెప్పారు. నీ బతుక్కి ఇంత నాటకం అవసరమా అని వర్మపై మండిపడ్డారు. ఇలాంటి కుట్రల పట్ల పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

వర్మ వెనుక ఉన్న పార్టీ తెలిస్తే సూటిగా ప్రశ్నించేవాడిని
రామ్ గోపాల్ వర్మ వెనుక ఏ పార్టీ ఉందో తెలిస్తే తాను సూటిగా అదే పార్టీని నిలదీసేవాడిని అని అల్లు అరవింద్ చెప్పారు. అతని కుట్ర వెనుక ఎవరో ఉన్నారన్నారు. ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో, పీఆర్పీ బ్యాడ్ ఎక్స్‌పీరియేన్స్ దృష్టిలో పెట్టుకొని పవన్ ముందుకు సాగుతున్నారని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications