కేసీఆర్ 'గ్రేటర్' ప్లాన్, బడ్జెట్లో లేకుండానే హడావుడి!
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ హడావుడి చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. స్వచ్ఛ నగరం, పేదలకు ఇళ్ల నిర్మాణం అంటూ కేసీఆర్ చేస్తున్న హడావుడి ఎన్నికల కోసమే అన్నారు.
రాష్ట్ర బడ్జెట్‌లో రూ.526 కోట్లే జీహెచ్ఎంకీ ప్రభుత్వం కేటాయించిందన్నారు. స్వచ్ఛ నగరానికే ఈ నిధులు సరిపోవన్నారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్ సవరించి అదనపు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం మే 16 నుంచి తలపెట్టిన స్వచ్ హైదరాబాద్ ఒక పబ్లిక్ స్టంట్ అన్నారు. హైదరాబాద్ ఇప్పటికే పచ్చటి నగరమని, పరిశుభ్రతకు మారుపేరని, గతంలో అనేక అవార్డులు పొందిందన్నారు. నేషనల్ జియోగ్రాఫిక్‌కు చెందిన ట్రావెలర్ మ్యాగజైన్ హైదరాబాద్‌ను తప్పనిసరిగా చూడాల్సిన నగరంగా పేర్కొన్నదన్నారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: డాక్టర్ కే లక్ష్మణ్
జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే ముఖ్యమంత్రి హైదరాబాదులో రెండు లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెబుతున్నారని బీజేపీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కే లక్ష్మణ్ వేరుగా ఆరోపించారు.
ఈ ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యుత్ అని మభ్య పెట్టిందన్నారు. తెలంగాణలో ఒక్క ప్రభుత్వ పాఠశాల మూసినా ఊరుకునేది లేదన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజల తరఫున బీజేపీ పోరాడుతుందన్నారు.












Click it and Unblock the Notifications