కానిస్టేబుల్‌ని నరికేశారు, భార్యపై డౌట్: ఆర్టీసీ సిబ్బంది జీతాలు కాజేసిన సైబర్ దొంగ
గజ్వేల్: ఓ కానిస్టేబుల్‌ను నడి రోడ్డు పైన నరికి చంపారు. ఈ సంఘటన మెదక్ జిల్లాలోని గజ్వెల్‌లో సోమవారం నాడు జరిగింది. నర్సింహులు అనే వ్యక్తి హైదరాబాదులోని బేగంపేట పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు.
సోమవారం అతడు పని నిమిత్తం గజ్వేల్ వెళ్లాడు. అక్కడ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నర్సింహులు పైన కత్తులతో దాడి చేశారు. నడి రోడ్డు పైన చంపారు. అయితే, నర్సింహులు హత్య వెనుక అతడి భార్య హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నర్సింహులుపై అతడి భార్య గతంలో హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు.

పొలం వెళ్తున్న రైతుపై ఎలుగుబంటి దాడి
పొలం వద్దకు వెళ్తున్న రైతుపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన కరీంనగర్‌లో చోటు చేసుకుంది. చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామంలో జరిగిన ఈ దాడిలో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందించారు.

బస్సు కండక్టర్, డ్రైవర్ల వేతనాలు కాజేసిన సైబర్ దొంగలు
హైదరాబాద్‌లో సైబర్ దొంగలు కలకలం సృష్టించారు. జీడిమెట్ల బస్ డిపోలో నలుగురు డ్రైవర్లు, ముగ్గురు కండక్టర్ల సాలరీ అకౌంట్ల నుంచి సైబర్ దొంగలు డబ్బులు కాజేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సైబర్ దొంగల కోసం గాలిస్తున్నారు.
శబరీష్ కనిపించినట్టు సమాచారం
పాతబస్తీలో అదృశ్యమైన పదో తరగతి విద్యార్థి, బీజేపీ నేత వెంకటరమణ కమారుడు శబరీష్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కనిపించాడని తెలుస్తోంది. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరు వ్యక్తులు శబరీష్‌ను తీసుకెళుతున్నట్టు గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఈ సమాచారంతో స్టేషన్‌లోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆదివారం నాడు సాయంత్రం ఇంటి నుంచి బయటకెళ్లిన శబరీష్ (15) ఇంటికి తిరిగిరాకపోవడంతో శాలిబండ పోలీస్ స్టేషన్‌లో అతని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications