ప్రియుడితో కలిసి భర్తని చంపిన భార్య, కత్తి కోసం రెండ్రోజులు గాలింపు
హైదరాబాద్: వివాహేతర సంబంధం కలిగిన ఉన్న ఓ భార్య భర్తను అడ్డు తప్పించుకునేందుకు అతనిని హత్య చేసిన సంఘటన హైదరాబాదులోని నాచారంలో చోటు చేసుకుంది. మల్లాపూర్‌లో ఈ నెల 21న ఈ హత్య కలకలం సృష్టించింది. ఈ హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు.
నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మెదక్ జిల్లాకు చెందిన నర్సయ్య కుమారుడు కృష్ణ(30) భార్య భాగ్య, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ వచ్చారు. మల్లాపూర్‌లో ఉంటున్నారు. అతను ఓ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు.
భాగ్య పెళ్లికి ముందే రామాయంపేటకు చెందిన కారు డ్రైవర్ రాజశేఖర్‌ను ప్రేమించింది. ఆ పెళ్లికి తల్లిదండ్రులను అంగీకరించలేదు. అనంతరం భాగ్యకు కృష్ణతో వివాహం చేశారు. పెళ్లయిన మూడో రోజునే భాగ్య ఇంట్లో నుంచి పారిపోయి రాజశేఖర్‌కు ఫోన్ చేసి, ఎక్కడికైనా పారిపోదామని చెప్పింది. వస్తానని అతడు చెప్పాడు.

ఆ తర్వాత కుమార్తె అదృశ్యమైంది. పోలీసులకు ఫిర్యాదు చేయగా వెతికి పట్టుకుని అప్పగించారు. ఆమెకు సర్దిచెప్పి కృష్ణతో కాపురానికి పంపారు. రాజశేఖర్‌తో వివాహేతర సంబంధం కొనసాగించింది. కృష్ణ ఉపాధి కోసం భార్యతో కలిసి ముంబై వెళ్లి ఏడాదిపాటు అక్కడ ఉండి తిరిగి వచ్చాడు.
భార్య భాగ్య గాజుల దుకాణం నిర్వహిస్తోంది. భర్త ఉద్యోగానికి వెళ్తున్నాడు. ముంబై నుంచి తిరిగి వచ్చాక మళ్లీ రాజశేఖర్‌తో వివాహేతర సంబంధం కొనసాగించింది. అతడు ఫోన్‌లు కూడా కొనిచ్చాడు. ఒక ఫోన్‌ను దాచిపెట్టి భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడితో మాట్లాడుతోంది.
ఈ వ్యవహరం తెలుసుకున్న భర్త హెచ్చరించాడు. దీంతో ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. తమ గురించి తెలియడంతో భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. ప్రియుడికి చెప్పింది. రాజశేఖర్ కత్తిని కొని పెట్టుకుని అదును కోసం ఎదురు చూస్తున్నాడు.
పథకం ప్రకారం ఈ నెల 21న తన భర్త విధులకు వెళ్లలేదని, ఇదే సరైన సమయమని భాగ్య ప్రియుడికి ఫోన్ చేసింది. తాను కూతురిని తీసుకుని మార్కెట్‌కు వెళుతున్నానని, వచ్చి పని ముగించాలని చెప్పింది. రాజశేఖర్ కిరాయి ఆటోలో వచ్చి కృష్ణను కత్తితో కడుపులో పొడిచి, మర్మావయవాలు, గొంతు కోసి పారిపోయాడు.
రాజశేఖర్‌తోపాటు హత్యకు పథకం వేసిన భాగ్యను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా పోలీసులు ఆ కత్తి కోసం రెండు రోజుల పాటు గాలించారు. అది దొరికినట్లుగా తెలుస్తోంది. నిందితులను అరెస్టు చేసినప్పటికీ హత్య చేసిన ఆయుధం దొరికితేనే రిమాండుకు తరలించాల్సి ఉంటుంది. ఇది దొరికినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications