కేసీఆర్ కు మళ్లీ చంద్రబాబే దిక్కా? రేవంత్ కూ కత్తిమీద సాము..!
తెలంగాణ రాజకీయాల్లో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పరిస్దితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ కు ఇది తొలి ఓటమి. అంతే కాదు తెలంగాణ సెంటిమెంట్ కు కాలం చెల్లిందని నిరూపించిన ఎన్నిక కూడా. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో పోటీకి అభ్యర్ధులే కరువైన బీఆర్ఎస్.. చివరికి సున్నాతో సరిపెట్టుకుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకూ దూరమైంది.
ఈ నేపథ్యంలో ఏదో ఒక మ్యాజిక్ చేస్తే తప్ప రాజకీయంగా కోలుకోవడం కష్టమని భావిస్తున్న కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే వ్యూహరచన చేస్తున్నారు. కేవలం సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుతత్వ తప్పిదాల్ని మాత్రమే నమ్ముకుంటే కోలుకోవడం కష్టమని భావిస్తున్న కేసీఆర్ దళం.. ఇప్పుడు వ్యూహాలకు పదునుపెడుతోంది. ఓవైపు ప్రభుత్వ తప్పిదాల్ని ఎండగడుతూనే మరోవైపు పాత సెంటిమెంట్ కు కొత్త రంగులద్ది రాజేసే పనిలో బిజీగా కనిపిస్తోంది.

తాజాగా కేసీఆర్ తన ప్రసంగంలో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రస్తావన తెచ్చారు. ఎన్డీయే పేరుతో మళ్లీ తెలంగాణ రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ పార్టీ శ్రేణుల్ని, రాష్ట్ర ప్రజల్ని అలర్ట్ చేశారు. తెలంగాణ ఏర్పాటును ఆపేందుకు ప్రయత్నించిన ఆయన్ను మనం ఇప్పుడు ఆపాల్సిందేనంటూ హితబోధ చేశారు. అయితే మారిన పరిస్ధితుల్లో తెలంగాణ సెంటిమెంట్ ప్రభావం నానాటికీ తగ్గిపోతున్న తరుణంలో కేసీఆర్ తిరిగి చంద్రబాబు చుట్టూ రాజకీయాన్ని తిప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది.
కేసీఆర్ ఇచ్చిన హింట్ తో రంగంలోకి దిగిన హరీష్ రావు.. నాగార్జున సాగర్ సమస్యపై ప్రెస్ మీట్ పెట్టారు. నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అక్రమంగా నీటిని తోడుతోందని, చంద్రబాబును ప్రశ్నించే దమ్ము రేవంత్‌రెడ్డికి లేదని తేల్చేశారు. కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం కూడా లేదన్నారు. తద్వారా అటు కేంద్రంపైకి, ఇటు చంద్రబాబుపైకి రేవంత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీనికి కాంగ్రెస్ పార్టీ వెంటనే దూకుడుగా స్పందించలేదు.
అయితే ఇక్కడ కేసీఆర్ వ్యూహం మాత్రం అందరికీ అర్ధమైంది. మరోసారి చంద్రబాబును బూచిగా చూపుతూ తెలంగాణ రాజకీయాల్లో బలపడేందుకు కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించేశారు. రాబోయే రోజుల్లో చంద్రబాబుతో కూడిన ఎన్డీయే, అందులో కీలకమైన బీజేపీని ఎదుర్కొనేందుకు కేసీఆర్ ప్రయత్నించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం చంద్రబాబు తెలంగాణను అడ్డుకున్నారని, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రాకు మేలు చేస్తున్నారనే ప్రచారం జనంలోకి తీసుకెళ్లబోతున్నారు. దీన్ని గ్రహించిన రేవంత్ రెడ్డి జలవివాదాల విషయంలో వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications